చిలకలూరిపేట నుండి పోటీ ఖాయమేనా?

గ‌త‌ ఎన్నికల వరకు నియోజకవర్గంలో చక్రంతిప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చాలాకాలంగా అడ్రస్ లేరట. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుల్లారావుకు బదులు నందమూరి సుహాసినికి టికెట్ ఇస్తే అందరం కష్టపడి గెలిపించుకుంటామని కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబుకు చెప్పారని సమాచారం.

Advertisement
Update:2023-03-19 11:49 IST

వచ్చే ఎన్నికల్లో నందమూరి వంశం నుండి చిలకలూరిపేటలో పోటీ చేయబోతున్నారా? అవుననే వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ సర్కిళ్ళ నుండి. నందమూరి సుహాసిని..నందమూరి హరికృష్ణ కూతురు, 2018 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి నుండి పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి సుహాసిని జనాలందరికీ పరిచయమైంది కూడా కూకట్‌పల్లిలో పోటీ చేసినపుడనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి ఆమె పోటీ చేయాలని నియోజకవర్గంలోని చాలామంది నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నారట.

పోయిన ఎన్నికల వరకు నియోజకవర్గంలో చక్రంతిప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చాలాకాలంగా అడ్రస్ లేరట. 2014-19 మధ్యలో మంత్రిగా పనిచేసిన పుల్లారావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని మొత్తం జిల్లాని అన్నివిధాలుగా ఊడ్చేశారట. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే తన అడ్రస్‌ను హైదరాబాద్‌కు మార్చేశారని సమాచారం. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటు హ్యాపీగా గడిపేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఏ పిలుపును కూడా పుల్లారావు పట్టించుకోలేదట.

నేతలకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకోలేదట. దాంతో అందరికీ మండిపోయి చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేశారట. దాదాపు నాలుగేళ్ళు పార్టీలో, నియోజకవర్గంలో కనబడని వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడగొడతామని చెప్పేశారట. పుల్లారావుకు బదులు నందమూరి సుహాసినికి టికెట్ ఇస్తే అందరం కష్టపడి గెలిపించుకుంటామని చెప్పారని సమాచారం.

ఇదే విషయాన్ని కొందరు నేతలు సుహాసినితో ప్రస్తావిస్తే టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమని ఆమె కూడా అన్నారట. దాంతో ఇదే విషయాన్ని నందమూరి బాలకృష్ణతో కూడా చెప్పారట. సుహాసిని పోటీ చేసే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడుతానని బాలయ్య నేతలకు హామీ ఇచ్చారట. జరుగుతున్న విషయాలను గమనిస్తున్న పుల్లారావు మొదటికే మోసం వచ్చేట్లుందని టెన్షన్ పడుతున్నారట. ఏదేమైనా పుల్లారావుకు టికెట్ ఇస్తే మాత్రం మళ్ళీ ఓడటం ఖాయమని నియోజకవర్గంలో నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారని సమాచారం. పరిస్థితులు చూస్తుంటే సుహాసిని పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే కనబడుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News