ఏపీలో మహిళలకు ఫ్రీ బస్.. విధి విధానాలపై రేపు క్లారిటీ
ఏపీలో ఫ్రీ బస్ జర్నీపై రకరకాల సందేహాలున్నాయి. ఉచిత రవాణా కేవలం జిల్లాకే పరిమితం అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా అనేది టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలులో పెడుతుందనే అంచనాలున్నా ఇప్పటి వరకు అది జరగలేదు. విధి విధానాలు ఖరారు చేయడానికి ప్రభుత్వం బాగా టైమ్ తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న విధానాన్ని పరిశీలించి వచ్చారు అధికారులు. సీఎం చంద్రబాబుకి రేపు(సోమవారం) నివేదిక సమర్పించబోతున్నారు. దీనిపై రేపు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పథకం అమలుపై కీలక ప్రకటన విడుదలవుతుంది.
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో కూడా ఈ పథకం అమలులో ఉంది. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, సిటీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ఫ్రీ జర్నీ వల్ల మహిళలకు ఏమేరకు లాభం చేకూరుకుతుందనే విషయాన్ని పక్కనపెడితే ఆర్టీసీపై మాత్రం నెలనెలా రూ.250కోట్లు భారం పడుతుందని తేలింది. ఈ భారాన్ని ప్రభుత్వం మోయాల్సి ఉంది. ఆమేరకు ఆర్టీసీకి నిధులు సర్దుబాటు చేస్తారా, లేక బకాయిలు మిగిల్చి ఆర్టీసీని మరింత కష్టాల్లోకి నెడతారా అనేది వేచి చూడాలి.
ఏపీలో ఫ్రీ బస్ జర్నీపై రకరకాల సందేహాలున్నాయి. ఉచిత రవాణా కేవలం జిల్లాకే పరిమితం అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏ జిల్లా అడ్రస్ తో ఆధార్ కార్డ్ ఉంటే, ఆ జిల్లా వరకే ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని అంటున్నారు. పోనీ రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లు, ఇతరత్రా ఉన్నత వర్గాల వారికి కూడా ఈ సౌకర్యం కల్పిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. విధి విధానాలపై రేపు క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిన పెన్షన్ జనాల్లో కాస్త సంతోషన్ని కలిగిస్తోంది. ఫ్రీ బస్ సర్వీస్ కూడా మొదలైతే మహిళలు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు.