తాడిపత్రిలో మళ్లీ టెన్షన్, టెన్షన్.. వైసీపీ నేత ఇంటికి నిప్పు
తాజా గొడవలు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన ఇంటిలో కీలకమైన డాక్యూమెంట్లు ఉండడంతో వాటిని తీసుకెళ్లేందుకు తాడిపత్రికి వచ్చినట్లు చెప్పారు పెద్దారెడ్డి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన వెహికిల్‌ను చుట్టుముట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి.
తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వైసీపీ నేత కందిగోపు మరళీ నివాసానికి నిప్పుపెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు. మురళీకి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు. తాజా గొడవలు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన ఇంటిలో కీలకమైన డాక్యూమెంట్లు ఉండడంతో వాటిని తీసుకెళ్లేందుకు తాడిపత్రికి వచ్చినట్లు చెప్పారు పెద్దారెడ్డి. అయితే తాజా ఉద్రిక్తతలతో వెంటనే తాడిపత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో తాడిపత్రి రణరంగంగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడిపత్రి విడిచిపెట్టి మరో చోట ఉంటున్నారు పెద్దారెడ్డి. తాజా ఉద్రిక్తతలతో తాడిపత్రిలో సెక్యూరిటీ పెంచారు పోలీసులు.