కేశినేని నాని రాజకీయ సన్యాసం.. కారణం ఏంటంటే?
తాను రాజకీయాలకు దూరమవుతున్నప్పటికీ.. విజయవాడ పట్ల తన నిబద్ధతగా బలంగానే ఉంటుందన్నారు. విజయవాడ అభివృద్ధికి వీలైనంత మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు నాని. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
రెండు సార్లు 2014, 2019లో ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవమన్నారు నాని. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢ సంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. విజయవాడ ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాలకు దూరమవుతున్నప్పటికీ.. విజయవాడ పట్ల తన నిబద్ధతగా బలంగానే ఉంటుందన్నారు. విజయవాడ అభివృద్ధికి వీలైనంత మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. రాజకీయ ప్రయాణంలో ఇప్పటివరకూ సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు నాని.
కొత్త ప్రయాణం మొదలుపెడతున్నానని చెప్పారు నాని. ఇక విజయవాడ అభివృద్ధి కోసం కొత్త ప్రజా ప్రతినిధులు పాటుపడాలని సూచించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ప్రజలకు పదేళ్ల పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో విబేధాల కారణంగా ఇటీవలి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరారు నాని. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి.. సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు.