జనసేనకు మరో నేత దొరికినట్లేనా..?

చాలా సంవత్సరాలుగా బాడిగ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన బాడిగ కాపు సంఘాల యాక్టివిటీస్ లో బాగా చురుగ్గా ఉంటారు. వ్యాపారవేత్తగా పేరున్న ఈ మాజీ ఎంపీ ఆర్థికంగా బాగా గట్టిస్థితిలో ఉన్నారు.

Advertisement
Update:2022-10-30 09:25 IST

ఇంతకాలానికి జనసేనకు మరో నేత దొరికినట్లేనా..? క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను బట్టి అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పవన్‌ను బాడిగ రామకృష్ణ కలిశారు. ఇంతకీ బాడిగ రామకృష్ణ ఎవరంటే మచిలీపట్నం మాజీ ఎంపీ. 2004లో బందర్ లోక్ సభ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 2009లో ఓడిపోయారు.

చాలా సంవత్సరాలుగా బాడిగ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన బాడిగ కాపు సంఘాల యాక్టివిటీస్ లో బాగా చురుగ్గా ఉంటారు. వ్యాపారవేత్తగా పేరున్న ఈ మాజీ ఎంపీ ఆర్థికంగా బాగా గట్టిస్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారసులను ఎన్నికల్లో దింపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 80 ఏళ్ళ వయసులో ఉన్న బాడిగ తన కొడుకు లేదా కూతురును రాజకీయాల్లో దింపాలని ట్రై చేస్తున్నారు.

పవన్‌ను కలవటంలో ఉద్దేశ్యం మచిలీపట్నం పార్లమెంటు సీటుకోసమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీ టికెట్ బాడిగకు ఎంత అవసరమో బాడిగ లాంటి వ్యాపారవేత్తలు, సీనియర్ పొలిటీషియన్లు పవన్ కు అంతే అవసరం. నిజానికి పవన్‌ను వదిలేస్తే పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరున్నారంటే నాదెండ్ల మనోహర్ పేరు తప్ప రెండోపేరు ఎవరు చెప్పలేరు. పార్టీపెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు చెప్పుకునేందుకు గట్టి నేతలే లేరు.

పవన్ స్వయంగా కాపు సామాజికవర్గమే అయినప్పటికీ కాపుల్లో కూడా ప్రముఖులు ఎవరూ పార్టీలో ఇంతవరకు చేరకపోవటం పెద్ద లోపంగా తయారైంది. ఒకవేళ ఎవరైనా పార్టీలో చేరుదామని అనుకున్నా పవన్ చుట్టూ ఉన్న కోటరీతో వేగటం కష్టమనే ప్రచారం గతంలో బాగా డ్యామేజిచేసింది. ఈ విషయాన్ని పవన్ కూడా తర్వాత స్వయంగా అంగీకరించారు. తన కోటరీగా చెప్పుకునే వాళ్ళవల్లే పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు.

తొందరలోనే ప్రక్షాళన చేస్తానని చెప్పినా ఇప్పటికీ వాళ్ళే పవన్ చుట్టూ ఉన్నారు. దాంతో ప్రముఖులెవరు పార్టీవైపు చూడటంలేదు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పార్టీని వదిలేసింది కూడా ఇలాంటి వాళ్ళవల్లే. ఈ నేపథ్యంలో పవన్ తో బాడిగ భేటీ అవటం మంచిదే కదా.

Tags:    
Advertisement

Similar News