ఏపీలో తొలిసారిగా విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు

ఏపీలో ఈ సెలవును అమలు చేయడం ఇదే తొలిసారి కాగా.. దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఇప్పటికే ఈ సెలవు అమలులో ఉంది.

Advertisement
Update: 2024-08-07 03:28 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు అవకాశం కల్పిస్తూ విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ (డీఎస్‌ఎన్‌ఎల్ఏయూ) నిర్ణయించింది. అంతేకాదు.. కేవలం మెయిల్‌ పంపించి ఈ సెలవును తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. నెలసరి రోజుల్లో ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజిస్ట్రార్‌ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు తాజాగా ప్రకటించారు.

నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడం లేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థినుల ప్రత్యేక సెలవు కోసం ప్రతిపాదన పెట్టగా యూనివర్సిటీ ఆమోదించింది.

ఏపీలో ఈ సెలవును అమలు చేయడం ఇదే తొలిసారి కాగా.. దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఇప్పటికే ఈ సెలవు అమలులో ఉంది. రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివ ర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ లో ఉన్న మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడీషియల్‌ అకాడమీల్లో ఈ విధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా వర్సిటీ ఎనిమిదోది కావడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News