వైసీపీ ఓటమికి మరో కారణం చెప్పిన కీలక నేత

జక్కంపూడి రాజా, కేతిరెడ్డి, కొట్టు సత్యనారాయణ.. తాజాగా కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరి విశ్లేషణలు కాస్త ఘాటుగానే ఉంటున్నాయి. మరి అధిష్టానం వీరి మాటల్ని ఇప్పుడైనా పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Advertisement
Update:2024-06-09 16:25 IST

కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా పాణ్యం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయన గెలుపు గ్యారెంటీ అనుకున్నారు. కానీ చివర్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తన విజయానికి బ్రేక్ వేసిందని అంటున్నారు కాటసాని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే వైసీపీ ఓడిపోయిందని కుండబద్దలుకొట్టారు. ఆ యాక్టే తమ కొంప ముంచిందన్నారు. తన చుట్టూ ఉన్న రైతులు, తన అభిమానులు కూడా భూములు పోతాయేమోనని భయపడ్డారని, వారికి సర్దిచెప్పడం తమ వల్ల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాటసాని రాం భూపాల్ రెడ్డి.


గడప గడప కార్యక్రమంలో తిరిగేటప్పుడే ఈ కార్యక్రమంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని, ఆ విషయం సీఎం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కానీ వారు తమ మాట వినలేదని అన్నారు కాటసాని. సీఎం కానీ, అధికారులు కానీ తమ మాట విని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికారులు దానిని సమర్థించే ప్రయత్నమే చేశారు కానీ, సీఎంకు సరైన సలహాలు ఇవ్వలేదన్నారు. మరోవైపు ఆ చట్టంపై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు బాగా విశ్వసించారని చెప్పారు కాటసాని.

ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెదుకుతున్న వైసీపీ నేతల్లో కొంతమంది మాత్రమే తమ మనసులో మాట బయటపెడుతున్నారు. అప్పుడు జరిగిన తప్పుల్ని నిర్భయంగా బయటకు చెబుతున్నారు. జక్కంపూడి రాజా, కేతిరెడ్డి, కొట్టు సత్యనారాయణ.. తాజాగా కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరి విశ్లేషణలు కాస్త ఘాటుగానే ఉంటున్నాయి. మరి అధిష్టానం వీరి మాటల్ని ఇప్పుడైనా పరిగణలోకి తీసుకుంటుందా, లేక అసమ్మతి ముద్రవేసి పక్కనపెడుతుందా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News