విచారణకు సహకరించడం లేదట..! జోగి అరెస్ట్ ఖాయమేనా..?

గతంలో పోలీస్ విచారణకు హాజరైన ప్రతిసారీ జోగి రమేష్ మీడియాతో మాట్లాడేవారు. కానీ తాజా విచారణ తర్వాత మాత్రం ఆయన సైలెంట్ గా వెళ్లిపోయారు.

Advertisement
Update:2024-08-22 11:08 IST

జోగి రమేష్ అరెస్ట్ ఖాయమేనా..?

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జరుగుతున్న విచారణ తీరు పరిశీలిస్తే ఆయన అరెస్ట్ ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. సహకరించడం లేదు అని అంటున్నారంటే కచ్చితంగా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కోర్టులు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా.. విచారణకు సహకరించడం లేదన్న కారణం చూపిస్తూ పోలీసులు ఆ బెయిల్ రద్దు కోరొచ్చు. అంటే, జోగిని కూడా జైలుకి పంపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నమాట.

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో ఇప్పటికే జోగి రమేష్ తనయుడు రాజీవ్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. "దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నాపై కక్ష తీర్చుకోండి, నా కొడుకు అమాయకుడు, అమెరికాలో చదువుకున్నా"డంటూ.. ఇటీవల జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనయుడితో పాటు, తండ్రిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి.

గతంలో పోలీస్ విచారణకు హాజరైన ప్రతిసారీ జోగి రమేష్ మీడియాతో మాట్లాడేవారు. కానీ తాజా విచారణ తర్వాత మాత్రం ఆయన సైలెంట్ గా వెళ్లిపోయారు. విచారణ తొలిరోజు, తన ఫోన్ ని కూడా జోగి రమేష్ పోలీసులకు ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం కేసు దర్యాప్తుకి అవసరమైన సమాచారం రమేష్‌ ఇవ్వలేదంటున్నారు. ఆయన చెప్పిన సమాధానాలకు తాము సంతృప్తి చెందలేదని చెప్పారు. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ తీసుకొచ్చి చూపిస్తున్నారని, సెల్‌ఫోన్, సిమ్‌ కార్డు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కోసం మళ్లీ పిలుస్తామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News