షర్మిలకు అంబటి దిమ్మతిరిగే కౌంటర్
పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
పదే పదే జగన్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్న షర్మిలకు వైసీపీ నుంచి మెల్ల మెల్లగా ప్రతిఘటన పెరుగుతోంది. వైఎస్ఆర్ కుమార్తె, జగన్ సోదరి అని ఇప్పటి వరకు వైసీపీ నేతలు కాస్త కనికరం చూపించేవారు కానీ, ఇప్పుడు మాత్రం షర్మిలకు అంతే ఘాటుగా బదులిస్తున్నారు. ప్రతిపక్ష హోదా అడగడంపై జగన్ ని విమర్శిస్తూ షర్మిల వేసిన ట్వీట్ కి ఆల్రడీ వైసీపీ నుంచి అధికారికంగా కౌంటర్ పడింది. ఇప్పుడు వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేసి షర్మిల రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు.
కాంగ్రెస్ లో చేరక ముందు, కాంగ్రెస్ లో చేరిన తర్వాత, షర్మిల ఎలా మాటలు మార్చారో వినండి అంటూ ఆమె పాత వీడియోని బయటపెట్టారు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన సమయంలో షర్మిల, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. తన తండ్రిని ఆ పార్టీ అవమానించిందని, ఆయన మరణించిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిందని అన్నారు షర్మిల. అలాంటి కాంగ్రెస్ కి ఎందుకు ఓటెయ్యాలని ఆమె ప్రశ్నించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు షర్మిల కాంగ్రెస్ ని తిట్టిపోశారు, తన తండ్రి పేరుని నాశనం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నించిందన్నారు. చివరకు ఆ కాంగ్రెస్ లోనే చేరిన ఆమె, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలు ఆమెకే పూర్తిగా రివర్స్ అవుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.