ఏబీఎన్, టీవీ5 ప్రతినిధులకు హైకోర్టులో నిరాశ

ప్రతి పోలీస్ స్టేషన్‌కు భౌగోలిక పరిధులుంటాయని, అలాగే ఏపీ సీఐడీకి సంబంధించి రాష్ట్రం మొత్తం ఒక పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారని ఏజీ వివరించారు. అలా చూసినప్పుడు తెలంగాణ అన్నది పొరుగు పోలీస్ స్టేషన్ అవుతుందని కోర్టుకు వివరించారు.

Advertisement
Update:2022-10-20 08:21 IST

రాష్ట్రంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల విషయంలో టీవీ5 మూర్తి, ఏబీఎన్ వెంకటకృష్ణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు.

నోటీసులు ఇచ్చే అధికారం ఏపీ సీఐడీకి లేదని వారి తరఫున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. కేసును ఏపీలో నమోదు చేశారని, మూర్తి, వెంకటకృష్ణ ఉంటున్నది హైదరాబాద్‌లో అని అందువల్ల వారికి సీఐడీ నోటీసులు ఇవ్వడం చెల్లదని, కాబట్టి నోటీసులను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వాదనతో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విబేధించారు. పక్క రాష్ట్రంలో ఉండి ఏపీపై కుట్రలు చేసినా కేసులు పెట్టకూడదన్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌కు భౌగోలిక పరిధులుంటాయని, అలాగే ఏపీ సీఐడీకి సంబంధించి రాష్ట్రం మొత్తం ఒక పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారని ఏజీ వివరించారు. అలా చూసినప్పుడు తెలంగాణ అన్నది పొరుగు పోలీస్ స్టేషన్ అవుతుందని కోర్టుకు వివరించారు. ఈ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయని.. కాబట్టి మూర్తి, వెంకటకృష్ణలు తెలంగాణలో ఉన్నప్పటికీ వారికి నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఏపీ సీఐడీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఇద్దరినీ ఆదేశించింది. విచారణకు రావాల్సిన తేదీని ఖరారు చేసి ఆ విషయాన్ని ఇరువురికి తెలియజేయాలని సీఐడీని ఆదేశించింది. అదే సమయంలో విచారణ సందర్భంగా మూర్తి, వెంకటకృష్ణ పట్ల కఠినంగా వ్యవహరించవద్దని కోర్టు ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News