క్యూలైన్లో కుమ్మేసుకున్నారు.. శ్రీకాళహస్తిలో రచ్చ

గ్రహణ కాలంలో ఇతర ఆలయాలేవీ తెరచి ఉండకపోవడంతో భక్తులంతా శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తారు. వీఐపీల సేవ కూడా ముఖ్యమే కాబట్టి మంత్రి రావడంతో కాసేపు క్యూలైన్లను కాసేపు ఆపేశారు సిబ్బంది. దీంతో సాధారణ భక్తుల్లో అసహనం పెరిగిపోయి కొట్టుకున్నారు.

Advertisement
Update:2022-10-26 07:37 IST

సూర్య గ్రహణం వేళ ఆలయాల‌న్నీ మూతబడ్డాయి. కానీ శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి దోషం లేకపోవడంతో భక్తులుపోటెత్తారు. అందులోనూ సూర్యగ్రహణ స్పర్శ కాలంలో జరిగే అభిషేకాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి తరలివచ్చారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అధికారులు కూడా ఆలయానికి వచ్చారు. దీంతో సాధారణ భక్తుల క్యూలైన్ ఆగిపోయింది. క్యూలైన్లో ఉన్న భక్తుల్లో అసహనం పెరిగింది, మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. మంత్రి అటుగా వెళ్తుండగానే ఈ గొడవ జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు.

పక్కనోడిని కొట్టి పాహిమాం అంటే..!

పక్కనోడిని చితకబాది, దేవుడి ముందు పాహిమాం అంటే కరుణిస్తాడా. మానవ సేవయే మాధవ సేవ అంటారు, కానీ మాధవుడి సేవ ఆలస్యమవుతోందని, మానవుడ్ని కొట్టి ముందుకు నడవాలని ఎవరూ చెప్పరు. ఇటీవల క్యూలైన్ల కుమ్ములాట తిరుమలలో కూడా జరిగింది. పెరటాసి మాసంలో భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లను కంట్రోల్ చేయడం టీటీడీకి సాధ్యం కాలేదు. తమిళనాడు భక్తులు, గుంటూరు భక్తుల మధ్య వాగ్వాదం జరిగి చివరకు ఒకరినొకరు కొట్టుకున్నారు, ఇప్పుడు శ్రీకాళహస్తిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

రద్దీ పెరుగుతోంది..

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా పూర్వ స్థితికి వచ్చాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. గతంలో భౌతిక దూరం అంటూ క్యూలైన్లలో కూడా ఒకరికొకరు అడుగు దూరంలో ఉండేవారు. కానీ ఇప్పుడు కరోనా భయం తగ్గిపోవడం, ఆంక్షలు లేకపోవడంతో రద్దీ పెరిగిపోతోంది. క్యూలైన్లలో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు. సిబ్బందికి కూడా భక్తుల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కావడంలేదు. అందులోనూ గ్రహణ కాలంలో ఇతర ఆలయాలేవీ తెరచి ఉండకపోవడంతో భక్తులంతా శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తారు. అదే సమయంలో వీఐపీల సేవ కూడా ముఖ్యమే కాబట్టి, క్యూలైన్లను కాసేపు ఆపేశారు సిబ్బంది. దీంతో సాధారణ భక్తుల్లో అసహనం పెరిగిపోయి కొట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News