పంతం నెగ్గించుకున్న విజయసాయి.. ఆ 9 ఛానెల్స్ కి షాక్
ఢిల్లీ హైకోర్టు విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థల్ని ఆదేశించింది.
తనపై తప్పుడు వార్తలు రాసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోనని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై పుకార్లను ప్రచారంలోకి తెచ్చిన 9 మీడియా సంస్థలకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. భవిష్యత్ లో కూడా అలాంటి కథనాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.
ఈటీవీ, ఆర్టీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్ తోపాటు మొత్తం 9 సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. విజయసాయిరెడ్డిపై ఇచ్చిన నిరాధార కథనాలను వెంటనే తొలగించాలని చెప్పింది. వాటన్నిటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇకపై ఇలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది.
తనకి సంబంధం లేని విషయంలో తన పేరుని ప్రస్తావించడమే కాకుండా, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేసేలా కథనాలు రాయడం సరికాదని ఇదివరకే విజయసాయిరెడ్డి ఆయా మీడియా సంస్థల్ని హెచ్చరించారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ రూ.10కోట్లకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థలకు ఆదేశాలిచ్చింది.