'తల్లికి వందనం'పై గందరగోళం.. క్లారిటీ కోసం డిమాండ్లు!
ఎన్నికల ప్రచారంలో ఎంత మంది పిల్లలున్నా అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన హామీ పత్రంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కూటమి. ఈ పథకం కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల నగదు అందిస్తామని చెప్పింది. ఇంట్లో నలుగురు విద్యార్థులు ఉంటే రూ.60 వేలు అందిస్తామంటూ మాటలు చెప్పింది.
తాజాగా ఈ పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేసింది ప్రభుత్వం. గైడ్‌లైన్స్ ఒక్క తల్లికి మాత్రమే అని పేర్కొనడం గందరగోళానికి దారి తీసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని గైడ్‌లైన్స్‌లో పొందుపరిచింది ప్రభుత్వం. ఇది ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను స్కూల్ లేదా కాలేజీలకు పంపేవారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రచారంలో ఎంత మంది పిల్లలున్నా అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. ఇక ఈ పథకానికి ఆధార్ కార్డుతో పాటు 75 శాతం హాజరును తప్పనిసరి చేసింది కూటమి ప్రభుత్వం.