విడదల రజినికి అసమ్మతి సెగ..
సదరు హెచ్చరికలు చేసిన నాయకుల సత్తా ఏంటి..? వారికి ఉన్న పలుకుబడి ఎంత..? వారికి ఓట్లు వస్తాయా, రావా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ పంచాయితీ రచ్చకెక్కడంతో చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. ఇవేవో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావు, చిన్న విషయాలను పెద్దవి చేసి చూపేలా టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలు కావు. వైసీపీ అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి రుజువులు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి, ఆయన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో అసమ్మతి నేతలు షాకిచ్చారు. ఆయనకు మరోసారి టికెట్ ఇస్తే సహకరించబోమంటూ అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఇటీవల మంత్రి అంబటి రాంబాబు వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మరో మంత్రి విడదల రజిని విషయంలో కూడా అసమ్మతి వర్గం ప్రాంతీయ సమన్వయకర్త దగ్గర పంచాయితీ పెట్టింది. 2024లో ఆమెకు చిలకలూరిపేట టికెట్ ఇస్తే, తమ నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగుతారని, అది పార్టీకే నష్టమని హెచ్చరించారు నాయకులు.
సదరు హెచ్చరికలు చేసిన నాయకుల సత్తా ఏంటి..? వారికి ఉన్న పలుకుబడి ఎంత..? వారికి ఓట్లు వస్తాయా, రావా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ పంచాయితీ రచ్చకెక్కడంతో చిలకలూరిపేట టికెట్ వ్యవహారం హాట్ హాట్ గా మారింది. పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు.. ఈ పేచీని ఎలా తీర్చాలా అంటూ తల పట్టుకున్నారు.
చిలకలూరిపేట టౌన్, నాదెండ్ల, యడ్లపాడు మండలాల నుంచి అసమ్మతి నాయకులు ఎంపీ బీదా మస్తాన్ రావుని కలిసి మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రజినిని నిలబెడితే, తాము సహకరించబోమన్నారు. అంతే కాదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందని, స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తుందని కాస్త ఘాటుగా హెచ్చరించారు. వీరందరి విన్నపాలు ఆలకించిన ఎంపీ బీదా.. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
సీనియర్ నేత మర్రి రాజశేఖర్, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో మంత్రి రజినికి ఇప్పటికే విభేదాలున్నాయి. ఇప్పుడు కొత్తగా కింది స్థాయి నేతలు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారు. దీంతో అధిష్టానానికి చిలకలూరిపేట టికెట్ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశముంది. కొంతమంది జగన్ కి నచ్చడంలేదు, మరికొందరు జనాలకి నచ్చడంలేదు, ఇంకొందరు ఇలా సహచర నేతలకు నచ్చడంలేదు.. మొత్తమ్మీద ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ వైసీపీలో కూడా టికెట్ల వ్యవహారం గొడవలకు దారితీసేలా కనపడుతోంది.