జగనన్న కాలనీలపై జగన్ తాజా స్పందన..
జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. మౌలిక సదుపాయాల దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇటీవల వర్షాలకు జగనన్న కాలనీల వద్ద జనసేన హడావిడి చేసింది. జగనన్న కాలనీలు నీటమునుగుతున్నాయని, నాణ్యత నాసిరకంగా ఉందని జనసేన నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిపించారు. తాజాగా సీఎం జగన్ ఆ కాలనీలపై స్పందించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభీవృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన జగన్, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. మౌలిక సదుపాయాల దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్నారు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదని చెప్పారు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు సీఎం జగన్.
స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం చాలా కీలకం అని చెప్పిన సీఎం జగన్... ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనదని, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్ ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు జగన్.