చంద్రబాబు విరాళాల వేట

నిధుల కొరత ఉందని గతంలో చంద్రబాబు అమరావతికోసం విరాళాలు సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.

Advertisement
Update:2024-07-31 07:05 IST

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతికోసం మళ్లీ విరాళాలు స్వీకరిస్తున్నారు. గతంలో 2014నుంచి 2019 వరకు కూడా ఆయన రాజధాని అభివృద్ధికోసం విరాళాలు తీసుకున్నారు. ఏకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఇటుకల పేరుతో విరాళాలు స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు అదే ఆనవాయితీ మొదలు పెట్టారు. అమరావతికోసం విరాళం ఇవ్వడం, సీఎం చంద్రబాబుతో ఫొటో దిగడం, టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం పొందడం ఈ సీక్వెన్స్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. తాజాగా న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ అమరావతికోసం రూ.4 లక్షలు విరాళం ఇవ్వగా.. సచివాలయంలో సీఎం చంద్రబాబు వారి కుటుంబానికి ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చారు. వారితో ఫొటోలు దిగారు. సదరు మహిళను అభినందిస్తూ.. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.

గతంలో కూడా చంద్రబాబు ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేస్తున్నారని ఓవైపు వైసీపీ నేతలు విమర్శిస్తున్నా మరోవైపు ఐదేళ్లపాటు అమరావతిని చర్చనీయాంశంగా ఉంచేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాస్టర్ ప్లాన్, రాజమౌళి ప్లాన్, సింగపూర్ ప్లాన్ ఇలా రకరకాల ప్లాన్ లతో ఐదేళ్లు గడిపారు. నిధుల కొరత ఉందని విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.

ఆ 15వేలకోట్ల సంగతేంటి..?

కేంద్ర బడ్జెట్ లో అమరావతికోసం 15వేల కోట్ల రూపాయలు అంటూ ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత అది కేవలం వరల్డ్ బ్యాంక్ అప్పు అని అసలు విషయం చెప్పారు. ప్రతిపక్ష వైసీపీ దీనిపై రాద్ధాంతం చేస్తోంది. సీఎం చంద్రబాబు మాత్రం ఆ అప్పు ఇప్పుడల్లా తీర్చేది కాదుకదా ఎందుకంత ఆందోళన అంటున్నారు. ఈసారి అమరావతి విషయంలో చంద్రబాబు ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో తాను చేసిన అభివృద్ధి ఇదీ అని ఎన్నికలనాటికి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Tags:    
Advertisement

Similar News