సీఐడీ అధికారులకూ దొరకటంలేదా?

సీఐడీ అధికారుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా లోకేష్ నోటీసులు తీసుకోకపోతే తనకే నష్టం.

Advertisement
Update:2023-09-30 10:39 IST

నారా లోకేష్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అరెస్టు భయంతో ఇన్నిరోజులు ఏపీలోకి ఎంటర్ కాకుండా ఢిల్లీలోనే ఉంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తనను సీఐడీ అధికారులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు డిస్మిస్ చేసేసింది. పనిలోపనిగా సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే 41 ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న అధికారులకు లోకేష్ దొరకటంలేదట.

ఢిల్లీలో లోకేష్ ఉన్నాడని సమాచారం ఉన్న ప్రతిచోటా సీఐడీ అధికారులు వెతుకుతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సాక్షి మీడియా కూడా ఇదే చెప్పింది. 15 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన లోకేష్ కొద్దిరోజులు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ క్వార్టర్స్ లో ఉన్నారట. తర్వాత అక్కడి నుండి ఒక హోటల్‌కు మారిపోయారట. మూడురోజుల క్రితం అక్కడి నుండి కూడా మారిపోయినట్లు సమాచారం. జయదేవ్ ఆఫీసు గెస్ట్ హౌస్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అకామిడేషనే కాదు వాహనాలను కూడా రెగ్యులర్‌గా మారుస్తున్నారట.

ఇదెంతవరకు నిజమో తెలియ‌దు కానీ సీఐడీ అధికారులకు దొరక్కుండా తిరగటం అన్నది లోకేష్‌కు నష్టమే చేస్తుంది. సీఐడీ అధికారుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా లోకేష్ నోటీసులు తీసుకోకపోతే తనకే నష్టం. అలాగే విచారణకు హాజరుకాకపోతే అదే విషయాన్ని సీఐడీ వెంటనే కోర్టుకు చెబుతుంది. అంతేకాకుండా నోటీసులు అందుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి అరెస్టుకు అనుమతి ఇవ్వమని సీఐడీ అధికారులు అడుగుతారు.

సీఐడీ పిటీషన్‌లో న్యాయం ఉంది కాబట్టి అప్పుడు కోర్టు లోకేష్ అరెస్టుకు అనుమతిచ్చే అవకాశం కూడా ఉంది. ఒకసారి కోర్టు ఆదేశాలతోనే సీఐడీ లోకేష్‌ను అరెస్టు చేస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకుని బెయిల్ తెచ్చుకోవటం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలన్నీ లోకేష్ లాయర్లు చెబుతున్నారో లేదో తెలియ‌డంలేదు. నోటీసులు తీసుకోకపోయినా, విచారణకు సహకరించకపోయినా కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని లోకేష్‌కు అర్థంకావటంలేదేమో. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవటం అంటే ఇదేనేమో.


Tags:    
Advertisement

Similar News