ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దొంగల బీభత్సం
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు నెల్లూరు జిల్లా ఉలవపాడు-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్యలో ఉండగా.. దొంగలు రిజర్వేషన్ బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారం దోచుకున్నారు.
హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు దోపిడీకి విఫల యత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు నెల్లూరు జిల్లా ఉలవపాడు-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్యలో ఉండగా.. దొంగలు రిజర్వేషన్ బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారం దోచుకున్నారు. మహిళల నుంచి దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అనంతరం ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద చైన్ లాగి రైలును నిలిపివేసి పరారయ్యారు. ఈ దోపిడీలో ఆరుగురు దుండగులు పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించి అందులో చోరీకి ప్రయత్నించారు. ఇంతలో రైలులోని పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.