ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి.. ఎమ్మెల్యే ఎన్నికల వరకు
విశాఖను రాజధాని చేస్తామంటున్న వైసీపీకి అక్కడ కూడా పట్టు దొరకలేదని ఎద్దేవా చేశారు టీడీపీ నేతలు. పార్టీ పెద్దలందర్నీ విశాఖలో మోహరించి ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయం చేశారని, కానీ పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేశారని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకోసం టీడీపీ నేతలంతా కష్టపడి పనిచేశారని, దానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలేనని అన్నారు చంద్రబాబు. ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే ఎన్నికల వరకు టీడీపీ నేతలు కలసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన టీడీపీ లేజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు.
పట్టభద్రుల నియోజకవర్గాల్లో వస్తున్న ఫలితాలతో చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టని ఆయన, ఫలితాల తర్వాత మాత్రం కాస్త ఉత్సాహంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులంతా కష్టపడ్డారని, ప్రజల మద్దతు తమకేనని తేలిందన్నారు. ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు లొంగలేదని, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. హడావుడిగా ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి ఏం తెచ్చారో ఈసారైనా చెబుతారా అని ప్రశ్నించారు చంద్రబాబు.
విశాఖలో కూడా పట్టులేదు..
విశాఖను రాజధాని చేస్తామంటున్న వైసీపీకి అక్కడ కూడా పట్టు దొరకలేదని ఎద్దేవా చేశారు టీడీపీ నేతలు. పార్టీ పెద్దలందర్నీ విశాఖలో మోహరించి ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయం చేశారని, కానీ పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేశారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారన్నారు. ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే సంకేతం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదని చెప్పారు. విశాఖ వాసులంతా వైసీపీని చూసి భయపడుతున్నారని, అందుకే వైసీపీ వ్యతిరేక తీర్పు ఇచ్చారన్నారు.