చంద్రబాబుది స్వర్ణయుగ పాలనా..?

1996లో ఎన్టీఆర్ చనిపోయి తర్వాత 1999 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రయ్యారో అప్పటినుండి చంద్రబాబు ఇష్టారాజ్యం మొదలైంది. తాను ఏమిచేసినా చెల్లిపోతుందనే ధైర్యం వచ్చేసింది.

Advertisement
Update:2024-01-20 10:36 IST

చంద్రబాబు పరిపాలన స్వర్ణయుగమా..? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పాలన స్వర్ణయుగమని జనాలు అనుకుంటున్నారా..? కడపజిల్లాలోని కమలాపురం, వెంకటగిరిలో ‘రా కదలిరా’ కార్యక్రమంలో భాగంగా బహిరంగసభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జనాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాతియుగ పరిపాలన కావాలా..? లేకపోతే స్వర్ణయుగ పరిపాలన కావాలా..? తేల్చుకోమన్నారు. తన ఉద్దేశ్యంలో జగన్మోహన్ రెడ్డిది రాతియుగ పాలన. తన పరిపాలనంతా స్వర్ణయుగ పాలన.

తన పరిపాలన నిజంగానే స్వర్ణయుగ పాలన అయితే జనాలు 2019 ఎన్నికల్లో ఎందుకింత ఘోరంగా ఓడించారని నిజాయితీగా విశ్లేషించుకుంటే అర్థ‌మవుతుంది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్నప్పుడు అంటే 1995-99 మధ్య కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలనచేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ పాలనను జనాలు మరచిపోయేట్లు చేయాలి కాబట్టి పాలనా సంస్కరణల పేరుతో జన్మభూమి, రైతుబజార్లు, అధికారుల బదిలీలకు మార్గదర్శకాలంటూ కాస్త హడావుడి చేశారు. మొదటి నాలుగేళ్ళు కాస్త పద్ధ‌తిగా ఉండేది.

1996లో ఎన్టీఆర్ చనిపోయి తర్వాత 1999 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రయ్యారో అప్పటినుండి చంద్రబాబు ఇష్టారాజ్యం మొదలైంది. తాను ఏమిచేసినా చెల్లిపోతుందనే ధైర్యం వచ్చేసింది. అప్పటినుంచి పాలనలో అరాచకాలు మొదలైంది. ముఖ్యంగా ఉద్యోగులను రాచిరంపాన పెట్టారు. ఉద్యోగులతో పాటు అన్నీవర్గాలు ఇబ్బందులు పడటంతో 2004లో ఓడిపోయారు. ఆ దెబ్బకు పదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. దాంతో తాను మారానని, మునుపటి చంద్రబాబును కాదని పదేపదే చెప్పుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన రూపంలో మూడోసారి అధికారంలోకి వచ్చారు.

అధికారంలోకి వచ్చింది మొదలు తన విశ్వరూపాన్ని చూపటం మొదలుపెట్టారు. అవినీతి, పార్టీనేతల విచ్చలవిడి తనం, భూకబ్జాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో 23 సీట్ల ఘోర పరాజయం. చంద్రబాబు పాలనింకా జనాల కళ్ళముందే కనబడుతోంది. అలాంటిది తన పరిపాలనను చంద్రబాబు స్వర్ణయుగ పాలనతో పోల్చుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ ది రాతియుగ పాలనా కాదు, చంద్రబాబు పాలన స్వర్ణయుగమూ కాదు. ప్రతి సభలోనూ చంద్రబాబు తనది స్వర్ణయుగ పాలననే చెబుతున్నారు. మరి జనాలు ఏమి తీర్పిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News