ఎన్టీయార్ జపం చేయాల్సిందేనా?

ఎన్టీయార్‌ను పొగడందే చంద్రబాబుకు రోజు గడవదు. ఎన్నికలు వచ్చినా, జనాలను ఆకర్షించాలన్నా ఎన్టీయార్ జపం చేయాల్సిందే తప్ప చంద్రబాబుకు మరో దారేలేదు.

Advertisement
Update:2022-12-22 11:35 IST

చంద్రబాబునాయుడు

నిజంగా ఎన్టీయార్ చాలా దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎవరైతే ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని లాగేసుకున్నారో, ఎవరైతే నడివీధిలో అందరి ముందు చెప్పులతో కొట్టించారో, ఎవరైతే మానసిక క్షోభతో మరణించటానికి కారకుడయ్యారో ఆయనే ఎన్టీయార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఎన్టీయార్ వీరుడు, శూరుడంటు పొగుడుతున్నారు. చివరి రోజుల్లో చంద్రబాబునాయుడు కారణంగా ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారో అప్పటి ఎన్టీయార్ ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది.

బతికున్నపుడు మానసికంగా చిత్రవధకు గురై చనిపోయిన తర్వాత చంద్రబాబే తన విగ్రహాలను ఆవిష్కరిస్తాడ‌ని బహుశా ఎన్టీయార్ ఏమాత్రం ఊహించి ఉండ‌రు. బుధవారం చంద్రబాబు తెలంగాణ పర్యటనలో అడుగడుగునా కనిపించిన దృశ్యాలివే. దాదాపు ఎన్నిమిదిన్నరేళ్ళ తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ దాటిన దగ్గర నుండి ఖమ్మంకు చేరుకునేంతవరకు మధ్యలో చాలా చోట్ల ఎన్టీయార్ విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు.

ప్రతిచోటా ఎన్టీయార్‌ను విపరీతంగా పొగిడారు. యుగపురుషుడున్నారు, కారణజన్ముడన్నారు, సంఘ సంస్కర్తన్నారు, చరిత్రపురుషుడన్నారు, పేదల ఆశాజ్యోతన్నారు. ఎన్టీయార్ రద్దుచేసిన పటేల్ పట్వారీ వ్యవస్ధ, మండల వ్యవస్ధ ఏర్పాటు అద్భుతమన్నారు. పూరి గుడిసెల్లో ఉంటున్న పేదలు, బడుగులకు శాశ్వాత ఇళ్ళు నిర్మించింది ఎన్టీయారే అన్నారు. ఒక్క రూపాయి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తన జీవితం మొత్తాన్ని ఎన్టీయార్ పేదల సంక్షేమానికే అంకితం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే బహిరంగ సభ పెట్టిందేమో చంద్రబాబు కోసం. కానీ చంద్రబాబు పొగిడిందేమో ఎన్టీయార్‌ను. తన గురించి కూడా తాను విపరీతంగా పొగుడుకున్నా ప్రసంగాన్ని మొదలుపెట్టింది మాత్రం ఎన్టీయార్ ప్రస్తావనతోనే. విషయం ఏమిటంటే ఎన్టీయార్ ప్రస్తావన లేందే, ఎన్టీయార్‌ను పొగడందే చంద్రబాబుకు రోజు గడవదు. ఎన్నికలు వచ్చినా, జనాలను ఆకర్షించాలన్నా ఎన్టీయార్ జపం చేయాల్సిందే తప్ప చంద్రబాబుకు మరో దారేలేదు. అప్పటి తరానికి ఎన్టీయార్‌కు చంద్రబాబు చేసిన ద్రోహం అంతా తెలుసు. ఇప్పటి తరంలో ఎక్కువ మందికి ఎన్టీయార్ అంటే జూనియర్ ఎన్టీయార్ మాత్రమే. అయినా ఎన్టీయార్ జపం చేయందే పూట గడవని స్ధితిలో చంద్రబాబు ఉండటం నిజంగా ఆశ్చర్యమే.

Tags:    
Advertisement

Similar News