చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు.. ఉత్సాహంలో టీడీపీ
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, మాజీ సీఎంలకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. `ఆజాదీ కా అమృతోత్సవ్` వేడుకల నిర్వహణకు ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ మీటింగ్ ఆగస్టు 6న జరుగనుంది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగనున్న ఈ మీటింగ్‌కు హాజరు కావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 వారాల కౌంట్ డౌన్‌ను గతేడాది మార్చి 12న ప్రారంభించింది. 2023 ఆగస్టు 15 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రాబోయే ఏడాదిలో చేపట్టాల్సిన కార్యాచరణను ఆగస్టు 6న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, మాజీ సీఎంలకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తుంది.
టీడీపీ గతంలో ఎన్డీయేలో భాగంగా ఉండేది. అయితే 2018లో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చి.. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. అప్పటి నుంచి చంద్రబాబు, మోడీ కలవలేదు. ఏపీలో ఘోర పరాజయం పాలైన తర్వాత బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చాలా సార్లు ప్రయత్నించినా.. బీజేపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ప్రధాని మోడీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు టీడీపీకి ఆహ్వానం అందింది. తాజాగా చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందడంతో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
బీజేపీ అధిష్టానానికి గతంలో టీడీపీకి ఉన్నంత కోపం ఇప్పుడు లేదని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తమతో జతకట్టడానికి ఇది నిదర్శనమని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అన్నట్లుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ కూడా కోరుకుంటోంది. ఇప్పుడు బీజేపీ కూడా తమతో చేయి కలుపుతుందని టీడీపీ భావిస్తోంది. అయితే పార్టీ అధినేతలు, మాజీ సీఎంలకు పంపినట్లుగానే కేంద్రం చంద్రబాబుకు ఆహ్వానం పంపిందని.. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు.