నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారా?

ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు ఇన్‌చార్జిలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.

Advertisement
Update:2023-02-06 10:27 IST

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పార్టీపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యల్లో తాజా నిర్ణయం ఏమిటంటే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక పరిశీలకుడిని నియమించటం. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు ఇన్‌చార్జిలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సరైన ఫీడ్ బ్యాక్ రావటంతో పాటు పార్టీ పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతలు ఎవరనే విషయం తెలిసిపోతుంది.

ప్రత్యేక పరిశీలకుల్లో చాలామంది వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేవారినే ఎంపిక చేయాలని కూడా అధినేత అనుకున్నారట. దీనివల్ల టికెట్‌పై ఆశలుండవు కాబట్టి అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పుంగనూరు, పీలేరు లాంటి కొన్ని చోట్ల ప్రత్యేక పరిశీలకులను నియమించారు. వీళ్ళు ఒకటికి రెండుసార్లు నియోజకవర్గమంతా తిరుగుతూ కిందస్థాయి క్యాడర్‌తో కూడా మాట్లాడుతున్నారు.

క్షేత్ర స్థాయిలో పార్టీ జెండాలు మోసి, బ్యానర్లు కట్టే అభిమానులు, క్యాడర్ నుండే అసలైన ఫీడ్ బ్యాక్ వస్తుందని చంద్రబాబు ఇంతకాలానికి తెలుసుకోవటమే పార్టీకి శుభపరిణామమని చెప్పాలి. ఇలాంటి వాళ్ళయితే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల్లోని లోపాలు, వాళ్ళపని తీరు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను, జనాల మనోభావాలను మొహమాటం లేకుండా ప్రత్యేక పరిశీలకులకు చెబుతారు. ఈ పరిశీలకులు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రిపోర్టు తయారుచేసి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అందిస్తారు. దీనివల్ల పార్టీ లోపాలు, బలాలు, సరిచేసుకోవాల్సిన సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చంద్రబాబు అనుకున్నారు.

ఎన్నికలకు ఇంకా 15 మాసాలుంది కాబట్టి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది. కాకపోతే ప్రత్యేక పరిశీలకులు చిత్తశుద్దితో తమ బాధ్యతలను నెరవేర్చాలంతే. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా బలమైన క్యాడర్ ఉండటమే పార్టీ అసలైన బలం. క్యాడర్ ఆకాంక్షల ప్రకారం, మెజారిటి అభిప్రాయాల ప్రకారం చంద్రబాబు గనుక టికెట్లిస్తే చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి గట్టిపోటీ తప్పదనటంలో సందేహంలేదు. మరి గట్టి అభ్యర్ధులను ఎంపికచేసుకోవటంలో చంద్రబాబు ఎంత గట్టిగా ఉంటారనేదే అసలైన సమస్య. చివరకు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News