మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై కేసు.. పుంగనూరులో టెన్షన్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సుహేల్ భాషా ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు. A-1గా మిథున్ రెడ్డి, A-2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మొత్తం 34 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మరో టీడీపీ నాయకుడు A.S.R.K.ప్రసాద్ ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై సెక్షన్ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డప్ప ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను పుంగనూరు రాకుండా కొద్దిరోజులుగా టీడీపీ శ్రేణులు అడ్డుపడుతున్నాయి.పెద్దిరెడ్డిని పుంగనూరులో అడుగుపెట్టనివ్వబోమంటూ వార్నింగ్ సైతం ఇస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా మిథున్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. నియోజకవర్గంలో తిరగనీయకపోవడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ ఫైర్ అవుతున్నారు.