ఏపీకి మోదీ.. క్రెడిట్ కోసం వైసీపీ, బీజేపీ పోటాపోటీ
అయితే గియితే ప్రెస్‌మీట్ మేం పెట్టాలి, లేదా స్థానిక అధికారులు పెట్టాలి కానీ, వైసీపీ నేతల జోక్యం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. మోదీని వైసీపీ నేతలు పొగిడితే, వచ్చే ఎన్నికల్లో తాము ఎవర్ని తిట్టి ప్రజల్ని ఓట్లడగాలనేది ఏపీ బీజేపీ నేతల లాజిక్.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రధాని మోదీ వస్తున్నారంటే ఆ సందడే వేరు. డబుల్ ఇంజిన్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మోదీ వస్తున్నారంటే కొన్నిసార్లు స్థానిక ప్రభుత్వాలకు సరైన సమాచారం కూడా ఉండదు. ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతలే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు, మోదీకి వెల్‌కమ్ చెప్పి, టాటా చెప్పి, వీలేతే గవర్నర్‌తో సమావేశం ఏర్పాటు చేసి ముగించేస్తారు. ఇప్పుడు ఏపీలో ఈ సీన్ రివర్స్ లో జరుగుతోంది. మోదీకి వెల్‌కమ్ చెప్పేందుకు అధికార వైసీపీ, ఏపీ బీజేపీ పోటీపడుతున్నాయి.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన పర్యటన షెడ్యూల్ చదివి వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ పనిచేస్తోందని, అందుకే బీజేపీతో సఖ్యతగా ఉన్నామని వివరించారు కూడా. సరిగ్గా ఇక్కడే ఏపీ బీజేపీకి కాలింది. అయితే గియితే ప్రెస్‌మీట్ మేం పెట్టాలి, లేదా స్థానిక అధికారులు పెట్టాలి కానీ, వైసీపీ నేతల జోక్యం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మోదీని వైసీపీ నేతలు పొగిడితే, వచ్చే ఎన్నికల్లో తాము ఎవర్ని తిట్టి ప్రజల్ని ఓట్లడగాలనేది ఏపీ బీజేపీ నేతల లాజిక్.
ఇప్పటి వరకూ ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నా.. అటువైపు నుంచి బీజేపీపై పల్లెత్తు మాట ఎవరూ తూలడం లేదు. ఎంతసేపు టీడీపీని, జనసేనను వైసీపీ టార్గెట్ చేస్తోందే కానీ, పోలవరం నిధుల విషయంలో బీజేపీని నిలదీయడం లేదు, విశాఖ రైల్వే జోన్ అతిగతి ఏమైందని అడగడం లేదు, స్టీల్ ప్లాంట్ మూసివేతకు నిరసనగా పోరాటం చేయడం లేదు. ఇక ప్రత్యేక హోదా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంటే ఒకరకంగా బీజేపీ ప్రాపకం కోసం ఇక్కడ వైసీపీ కష్టపడుతోంది. అటు టీడీపీ, జనసేన కూడా అంతే అనుకోండి. ఈ దశలో ఏపీలో మోదీ పర్యటన క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకోవాలా అనే సంశయం నాయకుల్లో మొదలైంది.
రేపు మోదీ శంకుస్థాపనలు చేసి కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే దాన్ని బీజేపీ ఘనతగా ప్రకటించుకోవాలనుకుంటున్నారు ఆ పార్టీ ఏపీ విభాగం నేతలు. కానీ అది తమ ఘనతే అని చెప్పుకోడానికి వైసీపీ ముందుగాన్ కర్చీఫ్ వేసింది. మోదీ పర్యటన షెడ్యూల్, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఒకరకంగా మోదీ చేపట్టబోయే అభివృద్ధి పనుల క్రెడిట్ వైసీపీదేనని చెప్పుకొచ్చారాయన. కానీ దీన్ని ఏపీ బీజేపీ అంగీకరించడంలేదు. అసలు విజయసాయి ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయసాయి ప్రకటనలు ప్రజలను తికమక పెడుతున్నాయని చెప్పారు. మొత్తమ్మీద మోదీ ఏపీకి రాకముందే బీజేపీ, వైసీపీ మధ్య పోటీ మొదలైంది. మోదీ ఏపీకి వచ్చాక ఇంకేం జరుగుతుందో చూడాలి.