మోడీ సాక్షిగా చంద్రబాబును దుయ్యబట్టిన సోము వీర్రాజు
ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని అడగడం కాదని, దాన్ని ఎందుకు వదులుకున్నారో చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే ఏపీ బీజేపీ నాయకుడు సోము వీర్రాజు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని దుయ్యబట్టారు. సోమవారంనాడు రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభ జరిగింది. ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో సోము వీర్రాజు వేదికపై నుంచి చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన ద్వంద్వవైఖరిని ఆయన ఏకిపారేశారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు వద్దన్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సభలు పెడుతున్నారని, ఎవరైనా ప్రత్యేక హోదాను ఎందుకు వదులుకున్నారని అడుగుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను ఎందుకు వదులుకున్నారని ఎవరు కూడా చంద్రబాబును నిలదీయడం లేదని ఆయన అన్నారు. ప్రతిదానికీ బీజేపీ ఎందుకు సమాధానాలు, వివరణలు ఇవ్వాలని ఆయన అడిగారు.
ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని అడగడం కాదని, దాన్ని ఎందుకు వదులుకున్నారో చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు. కాషాయరంగు డ్రెస్ కోడ్ ఓట్ల కోసం చంద్రబాబుకు గానీ టీడీపీకి గానీ బీజేపీ అవసరం కనిపిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చేది చంద్రబాబేనని, మళ్లీ తమను విమర్శించేది చంద్రబాబేనని సోము వీర్రాజు అన్నారు.
నోటాతో బీజేపీ పోటీ పడుతుందని టీడీపీ నాయకులే విమర్శించారని, మళ్లీ ఇప్పుడు వారికి బీజేపీ అవసరం వచ్చిందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో రోడ్ షో నిర్వహించాల్సి రావడంతో చంద్రబాబు ఈ సభకు హాజరు కాలేదు.