జనసేన కుటుంబ పార్టీ కాదా?
చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవటం బీజేపీ అగ్రనేతలకు ఇష్టం లేదు. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక మిగిలింది జనసేన మాత్రమే. అందుకనే వేరే దారిలేక జనసేతో పొత్తు పెట్టుకుని వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా చిత్రీకరిస్తోంది.
బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీలకు బీజేపీ వ్యతిరేకమని పదే పదే ప్రకటిస్తున్నారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని బల్లగుద్ది చెబుతున్నారు. ఇక్కడే వీర్రాజు మాటలు విచిత్రంగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలైతే జనసేన కుటుంబ పార్టీ కాదా? దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా కుటుంబ పార్టీనే అవుతుంది. మొదట ఎవరో పార్టీని ప్రారంభిస్తారు. తర్వాత వాళ్ళ భార్య, కొడుకు, కోడలు, కూతురు ఇలా ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు అందుకుంటారు.
సదరు పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతారు. వారి తర్వాత వాళ్ళ వారసులే సీఎం కుర్చీలో కూర్చుంటారు. మన దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఇది చాలా సహజం. ప్రాంతీయ పార్టీలు కమ్ కుటుంబ పార్టీలు అంతా ఒకటే. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, బీహార్‌లో జేడీయూ, ఏపీలో వైసీపీ, టీడీపీ, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ ఇలా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఒకేలా ఉంటుంది. అయితే తమిళనాడులో ఏఐఏడీఎంకేతోను, యూపీలో ఒకప్పుడు బీఎస్పీతోను, బీహార్‌లో జేడీయూతో, కాశ్మీర్‌లో పీడీపీ, మహారాష్ట్రలో శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని వీర్రాజు మరచిపోయారేమో.
జేడీయూ, శివసేన, ఎస్పీ, బీఎస్పీలను జాతీయ పార్టీలుగా చెప్పుకుంటారు కానీ బీహార్, మహారాష్ట్ర, యూపీలను దాటి ఈ పార్టీలు పెద్దగా ప్రభావం చూపింది లేదు. వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలని పదేపదే చెబుతున్న వీర్రాజు పై పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకున్నారని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఇపుడు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి.
ఏపీ విషయంలో జరుగుతుంది ఏమిటంటే రెండు సార్లు దెబ్బ తిన్న చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవటం అగ్రనేతలకు ఇష్టంలేదు. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదు. ఇక మిగిలింది జనసేన మాత్రమే. అందుకనే వేరే దారిలేక జనసేతో పొత్తు పెట్టుకుని వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా చిత్రీకరిస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారో వీర్రాజు చెప్పగలరా? ఇప్పుడు కుటుంబ పార్టీ అయిపోయిన టీడీపీ అప్పుడు జాతీయ పార్టీయా? బీజేపీకి ఇష్టమైతే పొత్తుకు ఓకే లేకపోతే కుటుంబ పార్టీలైపోతాయి ప్రాంతీయ పార్టీలు.