సారీ చెప్పిన బాలయ్య.. ఎవరికి..? ఎందుకు..?

దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అన్నారు బాలయ్య.

Advertisement
Update:2023-01-15 14:07 IST

పురాణాలు, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడుతుంటారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. సినిమా ఫంక్షన్లలో, రాజకీయ వేదికలపై కూడా ఆయన అవకాశం వస్తే పురాణాల గురించి ప్రస్తావిస్తారు. ఇటీవల ఓ కార్యక్రంలో ఆయన దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణ బ్రహ్మ అనే వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యావహారికంలో దేవాంగులుగా పరిగణించే దేవ బ్రాహ్మణ కులస్తులు బాలయ్య వ్యాఖ్యలను ఖండించారు. దేవాంగుల కులదైవం దేవల బ్రహ్మ. దేవతలకు ఆయనే వస్త్రాలు తయారు చేసి అందించేవారని, ఆయన శిష్యరికంలో దేవాంగులు వస్త్రాలు నేయడం నేర్చుకున్నారని, దాన్నే కులవృత్తిగా అలవరచుకున్నారని, ఆ నాటినుంచి ఈనాటి వరకు వారు తమ చేనేతను జీవనాధారంగా చేసుకున్నారని అంటారు. అయితే బాలకృష్ణ దేవల బ్రహ్మ బదులు రావణ బ్రహ్మ అనేశారు. రావణాసురుడి పేరు ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువత్తాయి. 

నన్ను క్షమించండి..

దేవ బ్రాహ్మణుల అభ్యంతరాలపై బాలకృష్ణ స్పందించారు. దేవాంగులంతా తనను క్షమించాలని కోరారు. దేవాంగుల మనసు గాయపరచాలని తనకు ఏమాత్రం లేదని, తనకున్న సమాచారం మేరకు తాను తప్పుగా మాట్లాడానని ఒప్పుకున్నారు. వారి మనసు నొప్పించి ఉంటే క్షమించాలన్నారు.




‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి బాధపడ్డా. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అని బాలకృష్ణ పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Tags:    
Advertisement

Similar News