ఆ ప్రెస్‌మీట్ వల్లే ఆనంపై దాడి జరిగిందా..?
వెంకటరమణారెడ్డిని టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరామర్శించారు. వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించింది వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. బైకులపై వచ్చిన 10 మంది యువకులు వెంకటరమణారెడ్డిపై దాడిచేసేందుకు వెంట కర్రలు కూడా తెచ్చుకున్నారు. నెల్లూరు ఆర్టీఏ కార్యాలయంలో నుంచి వెంకటరమణారెడ్డి బయటకు వస్తున్న సమయంలో కొందరు దాడికి యత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దాంతో దుండగులు కర్రలు, బైకులను అక్కడ వదిలేసి పరారయ్యారు.
వెంకటరమణారెడ్డిని టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరామర్శించారు. వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించింది వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జగన్‌కు వ్యతిరేకంగా వెంకటరమణారెడ్డి పెట్టిన ఒక ప్రెస్‌మీట్ ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో జగన్, ఆయన సతీమణి గురించి ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పుల ఖరీదుపైన విమర్శలు చేశారు. ఆ ప్రెస్‌మీట్‌లో వెంకటరమణారెడ్డి వాడిన భాష కాస్త అభ్యంతరకరంగానే ఉంది. ఆ కారణంగానే దాడికి యత్నించారేమోనని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
నెల్లూరు లాంటి చోట కూడా పట్టపగలు దాడులు చేసే సంస్కృతిని జగన్ తీసుకొచ్చారని టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శించారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. అటు ఈ దాడియత్నంపై నారా లోకేష్ స్పందించారు. వెంకటరమణారెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.