బాబుదే బాధ్యత.. దాడిని ఖండించిన జగన్
టీడీపీని గుడ్డిగా సమర్థించే మీడియాకి ఆ పార్టీ అండదండలు ఉంటాయని, నిస్పక్షపాతంగా వార్తలు ఇచ్చే వారిని మాత్రం అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్.
విశాఖలో డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. అది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. టీడీపీకి సంబంధం ఉన్న వ్యక్తులు చేసిన దాడికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు జగన్. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్నారాయన. దాడుల సంస్కృతి సరికాదని హితవు పలికారు.
మీడియాపై అణచివేత..
టీడీపీని గుడ్డిగా సమర్థించే మీడియాకి ఆ పార్టీ అండదండలు ఉంటాయని, నిస్పక్షపాతంగా వార్తలు ఇచ్చే వారిని మాత్రం అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. డీసీలో వచ్చిన వార్తలో తప్పులుంటే ప్రభుత్వం ఖండన ప్రకటన విడుదల చేయాలని, వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు పెనుముప్పుగా మారతాయని హెచ్చరించారు. ఇప్పటి వరకూ ప్రతిపక్షాలపైనే దాడులు జరిగాయని, ఇప్పుడు పత్రికలను కూడా టీడీపీ గూండాలు వదిలిపెట్టడంలేదని విమర్శించారు.
జగన్ ట్వీట్ తో టీడీపీ ఉలిక్కిపడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో డెక్కన్ క్రానికల్ యాజమాన్యంతో జగన్ ఉన్న ఫొటోని టీడీపీ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. వెల్ ప్లేయ్డ్ జగన్ అనే క్యాప్షన్ జత చేశారు.
దాడి ఘటనను టీడీపీ నుంచి ఎవరూ ఖండించకపోవడం విశేషం. సొంత పార్టీ నేతలు దాడి చేశారని తెలిసినా కూడా నాయకులు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.