ఆ లెటర్ ఇచ్చిన సన్నాసివి నువ్వే కదా..?
వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని, అలాంటి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బాబుకు లేదని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.
ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసివున్న సమయంలోనే బాబు తన స్వార్థం కోసం ప్యాకేజీ కావాలన్నాడని గుర్తుచేశారు. ప్రజలు ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోరని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే ముద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన సన్నాసివి నువ్వేగా చంద్రబాబూ అంటూ ఘాటుగా విమర్శించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడారని, కానీ, బాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను మంటగలిపి.. ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పాడని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని, అలాంటి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బాబుకు లేదని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దోచుకో.. దాచుకో.. అన్న తరహాలో అడ్డగోలుగా దోచుకుని.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడని చెప్పారు. జైలుకెళ్లి వచ్చినప్పటికీ బాబుకు బుద్ధిరాలేదని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యామ్‌ను ఇష్టానుసారంగా నిర్మించి.. వేల కోట్ల నష్టం వచ్చేలా చేసింది బాబేనని గుర్తుచేశారు.
చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోడీ సైతం మాట్లాడారని, పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్నాడంటూ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజధాని విషయంలో అమరావతి పేరుతో అక్రమంగా భూములు లాక్కోవడమే కాకుండా కోట్లాది రూపాయలు బినామీల ద్వారా బాబు దోచుకున్నాడని మంత్రి తెలిపారు. ప్రజాభీష్టం మేరకు అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.