చంద్రబాబూ.. నీకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించు..
ఎవరి హయంలో ప్రజలకు లబ్ధి చేకూరిందో ప్రజలనే అడుగుదామని, చంద్రబాబు, అచ్చెన్నకు చీము, నెత్తురు ఉంటే తన ఛాలెంజ్‌ని స్వీకరించాలని మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
మ్యానిఫెస్టో అమలుపై చంద్రబాబుకు, అచ్చెన్నాయుడికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ కోరుకున్న ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. ఎవరి హయంలో ప్రజలకు లబ్ధి చేకూరిందో ప్రజలనే అడుగుదామని, చంద్రబాబు, అచ్చెన్నకు చీము, నెత్తురు ఉంటే తన ఛాలెంజ్‌ని స్వీకరించాలని మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కాకాణి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
మ్యానిఫెస్టోని మాయం చేసిన చరిత్ర చంద్రబాబుది
అధికారం రాగానే మ్యానిఫెస్టో అమలు చేయకుండా.. మ్యానిఫెస్టోని మాయం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని మంత్రి కాకాణి విమర్శించారు. రాజకీయాల్లో నీతిమాలిన వ్యక్తి, అబద్ధాలకోరు, నయవంచనకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆయన జీవితమంతా అబద్ధాలమయమని, అబద్ధానికి నిలువెత్తు రూపం చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టే సత్యనాదెళ్ల సీఈఓగా ఎదిగారని చంద్రబాబు చెప్పడం కంటే పచ్చి అబద్ధమేదైనా ఉందా అని ప్రశ్నించారు. 1992లో సత్యనాదేళ్ల మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరారని, అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాలేదని, చంద్రబాబు అబద్ధాలకోరు అనడానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి ధ్వజమెత్తారు.
మ్యానిఫెస్టో పట్టుకొని ఇంటింటికీ వెళుతున్నాం..
ఇదిగో మేము అమలు చేసిన మ్యానిఫెస్టో అంటూ తాము ప్రతి ఇంటికీ వెళ్తున్నామని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడమే ధ్యేయంగా "జగనన్న సురక్ష" కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ఏయే పథకాలు అందించామో వివరిస్తూ.. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు, సేవలు అందని వారి సమస్యలను పరిష్కరించడం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకువచ్చామని వివరించారు.