లేఅవుట్లలో ఐదు శాతం స్థలంపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ఈ జీవోపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ చివరకు ఈ నిర్ణయం ఇతర పరిణామాలకు దాని తీసింది.

Advertisement
Update:2023-01-26 12:12 IST

పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ లేఅవుట్లు వేసిన అందులో ఐదు శాతం స్థలాన్ని పేదల కోసం తప్పనిసరిగా కేటాయించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంది.

ప‌ట్టణ ప్రాంతాల్లో వేసే లేఅవుట్లలోని మొత్తం స్థలంలో ఐదు శాతం పేదల ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సిందిగా 2021 డిసెంబర్‌లో ప్రభుత్వం జీవో 145ను జారీ చేసింది. ఒకవేళ లేఅవుట్లలో స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాకపోతే మూడు కిలోమీటర్ల పరిధిలో అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పింది. అదీ సాధ్యం కానప్పుడు ఐదు శాతం స్థలానికి విలువ లెక్క కట్టి ఆ మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలని ఆప్షన్ ఇచ్చింది.

ఈ జీవోపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ చివరకు ఈ నిర్ణయం ఇతర పరిణామాలకు దాని తీసింది. రాష్ట్రంలో లేఅవుట్ల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర మొత్తం మీద 1000 ఎకరాలకు లోపే లేఅవుట్లకు జీవో వచ్చిన తర్వాత అనుమతులు తీసుకున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి ఐదు శాతం స్థలం ఇవ్వకుండా తప్పించుకోవడానికి రాజకీయ నాయకులను ఆశ్రయించారు. నాయకుల అండతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పనులు చేస్తున్నారు.

దాంతో కొత్త లేఅవుట్లకు అనుమతి ఇచ్చే సమయంలో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోయింది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయం పైనా పడింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు శాతం స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలన్న జీవోను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News