మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈసారి ఎందుకంటే..?
ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్ మళ్లీ ఢిల్లీకి వెళ్తారని, ఈసారి కచ్చితంగా స్పెషల్ స్టేటస్ పై గట్టిగా పోరాటం చేస్తారని నాలుగు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల అకౌంట్లలో కాస్త వ్యంగ్యంగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిన వెంటనే జగన్ ఢిల్లీకి అంటూ టీడీపీ నేతలు కూడా సెటైర్లు పేల్చారు. అప్పటికి అవి పుకార్లే అయినా, ఇప్పుడు మాత్రం నిజమయ్యాయి. అవును, జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర విభజనకు సంబధించి ఇప్పటి వరకు పరిష్కారం కాని కొన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాయని తెలిపారు సీఎస్ జవహర్ రెడ్డి. దీనికోసం కేంద్ర కార్యదర్శుల సమావేశానికి రేపు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. తమతోపాటు సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారన్నారు. ఈ సమావేశం కోసం ఆయన విదేశీ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని, రెండ్రోజుల్లో జగన్ ఢిల్లీకి వస్తారని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంతో పాటు, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం అవసరం ఢిల్లీలో ఉందని వివరించారు.
ఇంత ఆలస్యంగానా..?
ఇటీవల సీఎం జగన్ వసతి దీవెన కార్యక్రమం వాయిదా పడింది. దానికి కారణం అవినాష్ రెడ్డి కేసు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అప్పట్లో కనీసం ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించలేదు. కారణం ఇదేనని చెప్పలేదు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేక ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేశామని అన్నారు. ఈ విషయంలో మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివరణ ఏదో అప్పుడే ఇచ్చి ఉంటే, మీడియాలో ఆ కథనాలు వచ్చేవి కాదుకదా అనే సంగతి మాత్రం ఆయన మరచిపోయినట్టున్నారు. మొత్తమ్మీద జగన్ ఢిల్లీ పర్యటన మరోసారి టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా విమర్శలకు మరింత పదును పెట్టింది.