ఉద్యోగులు వద్దంటున్నా జీపీఎస్ కే 'ఎస్' అన్న జగన్

జీపీఎస్ కి ఆమోదముద్రతోపాటు మరికొన్ని ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకి అంగీకారం తెలిపింది.

Advertisement
Update:2023-06-07 15:37 IST

ఏపీ ఉద్యోగులకు, వైసీపీ ప్రభుత్వానికి ఒకే విషయంలో పేచీ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్, నాలుగేళ్లయినా ఆ విషయంలో ముందగుడు వేయలేకపోయారు. అదే సమయంలో కనీసం ఆ హామీ నెరవేరుస్తాననే విషయాన్ని కూడా ధైర్యంగా చెప్పలేదు. మధ్యే మార్గంగా జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్)ని తెరపైకి తెచ్చింది మంత్రి వర్గ ఉపసంఘం. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు ససేమిరా అన్నారు. అయినా కూడా ఈరోజు జరిగిన మంత్రివర్గ భేటీలో జీపీఎస్ కి ఆమోదముద్ర పడింది.


పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) కావాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఎన్నికల ముందు మీరిచ్చిన హామీయే కదా అని అడుగుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కానీ జగన్ మాత్రం జీపీఎస్ అంటున్నారు. కేబినెట్ ఆమోదంతో త్వరలో బిల్లు కూడా రెడీ చేస్తున్నారు. మరి దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. జీపీఎస్ కి ససేమిరా అంటున్న నాయకులు కేబినెట్ నిర్ణయంతో మరింత రగిలిపోయే అవకాశముంది.

ఏపీ కేబినెట్ ఇతర నిర్ణయాలు..

జీపీఎస్ కి ఆమోదముద్రతోపాటు మరికొన్ని ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకి అంగీకారం తెలిపింది. జగనన్న అమ్మఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపుకోసం రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవల కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకోడానికి ఏపీఎఫ్ఎస్ఎల్ కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీలలో 706 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహించేందుకు, టెన్త్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో అవార్డులు ప్రదానం చేసేందుకు జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Tags:    
Advertisement

Similar News