ఎన్టీఆర్ అమిత్ షా భేటీ.. చంకలు గుద్దుకుంటున్న ఏపీ బీజేపీ..
ఈ విషయంలో ఏపీ బీజేపీ మాత్రం చంకలు గుద్దుకుంటోంది. జూ.ఎన్టీఆర్-అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్రాల భవిష్యత్ రాజకీయాల్లో జరిగే కీలక మార్పులకు సంకేతంగా భావించాలంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.
హైదరాబాద్ లో అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య అరగంటకు పైగా మాటామంతీ జరిగింది. వారిద్దరూ కలసి భోజనం చేసి, సినిమా విషయాలు మాట్లాడుకున్నారని వినికిడి. ఎన్టీఆర్ భుజం తట్టి, మంచి నటుడివంటూ అమిత్ షా ప్రోత్సహించారనేది మాత్రం వాస్తవం. అంతకు మించి ఎవరు ఏం మాట్లాడుకున్నా అది కల్పితం, ప్రస్తుతానికి అనధికారికం. అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ మాత్రం చంకలు గుద్దుకుంటోంది. జూ.ఎన్టీఆర్-అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్రాల భవిష్యత్ రాజకీయాల్లో జరిగే కీలక మార్పులకు సంకేతంగా భావించాలంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.
యువత, రాజకీయం..
నోవాటెల్ హోటల్ లో కేవలం సినిమాల గురించి చర్చ జరిగినట్టు బయటకు వినిపిస్తుంటే.. విష్ణువర్దన్ రెడ్డి మాత్రం యువత, రాజకీయం, ఎన్టీఆర్ అంటూ రాగాలు తీస్తున్నారు. అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారాయన. యువత రాజకీయాల్లోకి రావాలని అమిత్ షా ఎప్పుడూ కోరుకుంటారని, భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఈ భేటీ నాంది పలికిందని కూడా చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ మావాడే..
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని గుర్తు చేసిన విష్ణువర్దన్ రెడ్డి, ఆయనకు రాజకీయ చైతన్యం ఉందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అత్తమ్మ పురంధేశ్వరి బీజేపీలోనే ఉన్నారని అన్నారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ బీజేపీలో చేరినంత హడావిడి చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఎన్టీఆర్ పేరుతో ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నారు.
మహానటుడు అమర్నాథ్..
మంత్రి అమర్నాథ్ మహా నటుడని, దావోస్ వెళ్లిన అమర్నాథ్ ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు విష్ణువర్దన్ రెడ్డి. బీజేపీ అవినీతిపరులను దగ్గరకు రానీయదని, అవినీతిపరులు బీజేపీలో చేరి గంగలో మునిగినట్టుగా పునీతలవుదామని భావిస్తే.. అది కుదరని పని అని తేల్చి చెప్పారు. ఏపీలో బీజేపీ బలపడకూడదనే ఉద్దశంతో.. బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్నామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నారని కానీ వారి పప్పులు ఉడకవని అన్నారు.