పొత్తుకోసం బాబు ఢిల్లీబాట.. ముందే హింటిచ్చిన జగన్

స్వయంగా అమిత్ షా నే బాబుకి ఆహ్వానం పంపారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. బాబు తిరిగొచ్చాక, పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని పొత్తులు ఖాయం అవుతాయని అంటున్నారు. ఈ పొత్తుల ఎత్తుల గురించి ఒకరోజు ముందే సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement
Update:2024-02-07 11:45 IST

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లూ టీడీపీని దూరం పెట్టిన బీజేపీ ఇప్పుడు కొత్త రాజకీయ క్రీడకు తెరలేపింది. పొత్తు రాజకీయాలకోసం చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు చర్చలు జరుపుతారని, స్వయంగా అమిత్ షా నే బాబుకి ఆహ్వానం పంపారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. బాబు తిరిగొచ్చాక, పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని పొత్తులు ఖాయం అవుతాయని అంటున్నారు. అయితే ఈ పొత్తుల ఎత్తుల గురించి ఒకరోజు ముందే సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కేంద్రంలో ఏ పార్టీకి కూడా ఈసారి సంపూర్ణ మెజార్టీ రాకూడదని తాను కోరుకుంటున్నట్టు జగన్ నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. అలా మెజార్టీ రాకపోతేనే అవి ఏపీవైపు చూస్తాయని, అప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులను డిమాండ్ చేసి తీసుకోవచ్చని, ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చనేది ఆయన ఆలోచన. అదే సమయంలో చంద్రబాబు పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. "చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, ఆయన పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు, జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా అంటకాగుతున్నారు." అని అన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్టు ముందుగానే జగన్ ఊహించారు. ఈరోజు చంద్రబాబు ఢిల్లీ యాత్రతో అది నిజమేనని తేలిపోయింది.

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచన. అందుకే జనసేనతో జతకట్టారు. పవన్ కి మాయమాటలు చెప్పి తక్కువ సీట్లతో తన దారికి తెచ్చుకున్నారు. బీజేపీతో కూడా పొత్తు కావాలి కానీ ఎక్కువ సీట్లు, గెలిచే సీట్లు ఆ పార్టీకి ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు. జాతీయ స్థాయిలో పొత్తు ఖరారయితే ఏపీలో వ్యవహారం చక్కబెట్టడానికి పురంద్రేశ్వరి సిద్ధంగానే ఉన్నారు. అందుకే బాబు ఉత్సాహంగా ఢిల్లీకి బయలుదేరారు. మరి బీజేపీ అధిష్టానం అంత సులభంగా బాబు బుట్టలో పడుతుందో లేదో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News