కుప్పం గరం గరం.. ప్రశాంతంగా బంద్..
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనను కూడా తన నియోజకవర్గంలో తిరగనీయడం లేదంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. కావాలనే టీడీపీ నేతలు తమవారిని రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ నేతలు బదులిస్తున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు వచ్చే మార్గంలో వైసీపీ జెండాలు, బ్యానర్లు కట్టడం, కొంతమంది చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కుప్పంలో వాతావరణం వేడెక్కింది. ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనను కూడా తన నియోజకవర్గంలో తిరగనీయడం లేదంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. కావాలనే టీడీపీ నేతలు తమవారిని రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ నేతలు బదులిస్తున్నారు.
భరత్‌కు భద్రత పెంపు..
కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కుప్పం చేరుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భద్రత పెంచారు. అదనపు బలగాలు మోహరించారు. కుప్పంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రశాంతంగా బంద్..
నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రశాంతంగా మొదలైంది. వైసీపీ నేతలు ఇచ్చిన బంద్ పిలుపుతో ఎక్కడికక్కడ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. వైసీపీ, టీడీపీ నేతలు మాత్రం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. పదే పదే కుప్పం వెళ్తున్న బాబు, కుప్పం మీద ప్రేమ పుట్టిందా ? కుప్పం అంటే భయం పట్టిందా ? అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. అటు టీడీపీ బ్యాచ్ కూడా అంబటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తమ్మీద తొలిసారి చంద్రబాబుకి కుప్పంలో ఎదురు దెబ్బ తగిలినట్టయింది. స్థానిక ఎన్నికల్లో ఓటమి విషయం పక్కనపెడితే.. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అడ్డంకి తగలడం ఇదే తొలిసారి. దీంతో కుప్పంలో టీడీపీ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అటు వైసీపీ కూడా తమ పరపతి పెంచుకోడానికి ఇదే అదనుగా భావిస్తోంది.