కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న సీఎం జగన్ భద్రతా సిబ్బంది

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ తీరు భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురి చేసింది.

Advertisement
Update:2023-05-23 16:17 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ తీరు భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురి చేసింది. సదరు కానిస్టేబుల్‌ను సీఎం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు వెళ్లిన జగన్‌ మోహన్ రెడ్డి అనంతరం తాడేపల్లిలోని నివాసానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

సీఎం క్యాంపు కార్యాలయం సమీపానికి కాన్వాయ్ రాగానే ఒక కానిస్టేబుల్ అడ్డుగా వెళ్లారు. సీఎం కాన్వాయ్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. చేతిలో ఒక వినతిపత్రం తీసుకుని కానిస్టేబుల్‌ సీఎం వాహనాలకు అడ్డుగా వెళ్లారు. యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ ఇలా అడ్డుగా రావడంతో సీఎం కాన్వాయ్‌ ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే కాన్వాయ్‌ వెంట ఉన్న సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది సదరు కానిస్టేబుల్‌లో అదుపులోకి తీసుకున్నారు.

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఇలా ఎందుకు చేశారన్న దానిపై అతడిని ప్రశ్నిస్తున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు తాను ప్రయత్నించినట్టు కానిస్టేబుల్ చెబుతున్నట్టు సమాచారం. అయితే కానిస్టేబుల్‌ను భద్రతా సిబ్బంది తీసుకెళ్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి గానీ ఆ కానిస్టేబుల్ పేరు, ఇతర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

సీఎం భద్రతకు సంబంధించిన అంశం కావడంతో నిజంగానే వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారా? ఆ వినతిపత్రంలో ఏముంది అన్న దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News