జగన్ పాపం..! కాదు చంద్రబాబు శాపం..!!
కూటమి ప్రభుత్వం తన బాధ్యత మరిచి, తప్పుని జగన్ పై నెట్టేసే దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన ఏపీలో రాజకీయ కలకలం రేపింది. తప్పు మీదంటే మీదంటూ అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మరణించినవారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈరోజు చంద్రబాబు పరామర్శకు వెళ్లారు. ఈలోగా ఆ తప్పుని వైసీపీ ఖాతాలో వేసేందుకు సోషల్ మీడియాలో టీడీపీ ఓ కథనాన్ని వైరల్ చేస్తోంది.
తప్పంతా జగన్ దే..
అచ్యుతాపురం ప్రమాదానికి కారణం గత ప్రభుత్వమేనని టీడీపీ తేల్చి చెబుతోంది. ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీ ఏజెన్సీ తో చేయిస్తానని గతంలో జగన్ చెప్పారని, అది కూడా సరిగ్గా చేయించక పోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. సేఫ్టీ లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కమిషన్ దండుకున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వైసీపీ హయాంలో వరుసగా 15 ప్రమాదాలు జరిగాయని ఆరోపించారు.
వైసీపీ కౌంటర్..
కూటమి ప్రభుత్వం తన బాధ్యత మరిచి, తప్పుని జగన్ పై నెట్టేసే దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన తర్వాత మృతుల కుటుంబాలకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కోటి రూపాయల పరిహారం ఇచ్చిన ఘనత జగన్ ది అని పార్టీ గుర్తు చేసింది. పరిశ్రమల కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని చెప్పింది, కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించింది కూడా జగనేనని పార్టీ తన ట్వీట్ లో పేర్కొంది. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని, ప్రమాదంలో మరణిస్తే ఆ సంస్థ రూ.50 లక్షలు పరిహారం ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని చెప్పింది కూడా జగనేనని పార్టీ అంటోంది. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని వైసీపీ ఆరోపిస్తోంది.