'తెలంగాణ గుండె'ను తడిమిన 'విరాటపర్వం'!

"అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు.పక్షులరాగాల నడుమ గరికపూల పాన్పుమీద అమ్మా! నను కన్నందుకు విప్లవాభి వందనాలు. నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని వినిపించావు. కొండల్లో చెలరేగిన సుడిగాలిని చూపినావు.." అన్నది శివసాగర్ కవితలోని పంక్తులు. "అమ్మా నన్నుకన్నందుకు విప్లవాభివందనాలు" అని విరాటపర్వం సినిమాలో నక్సలైట్ రవన్న(రానా) తన తల్లి(జరీనా వాహబ్)కు వినిపిస్తాడు.ఇది 'విప్లవ కథా ప్రేమ చిత్రం'.ఈ సినిమా తెలంగాణ గుండెను టచ్ చేసింది.1990 ల్లో తెలంగాణ అనేక గాయాలతో పచ్చి పుండులాగా ఉండింది.ఆ కాలంలో నక్సలైట్ […]

Advertisement
Update:2022-06-17 07:24 IST

"అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు.పక్షులరాగాల నడుమ
గరికపూల పాన్పుమీద అమ్మా! నను కన్నందుకు విప్లవాభి వందనాలు.
నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని వినిపించావు. కొండల్లో చెలరేగిన
సుడిగాలిని చూపినావు.." అన్నది శివసాగర్ కవితలోని పంక్తులు.

"అమ్మా నన్నుకన్నందుకు విప్లవాభివందనాలు" అని విరాటపర్వం సినిమాలో నక్సలైట్ రవన్న(రానా) తన తల్లి(జరీనా వాహబ్)కు వినిపిస్తాడు.ఇది 'విప్లవ కథా ప్రేమ చిత్రం'.ఈ సినిమా తెలంగాణ గుండెను టచ్ చేసింది.1990 ల్లో తెలంగాణ అనేక గాయాలతో పచ్చి పుండులాగా ఉండింది.ఆ కాలంలో నక్సలైట్ ఉద్యమం ఉత్తర తెలంగాణను ఎంత ప్రభావితం చేసిందో మాటల్లో చెప్పలేం.ఇన్ ఫార్మర్లు,కోవర్టుల వ్యవస్థలతో విప్లవోద్యమాన్ని అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను 'విరాటపర్వం'లో దర్శకుడు వేణు ఊడుగుల శషభిషల్లేకుండా చూపాడు.ఖమ్మంకు చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తూము సరళ నక్సలైట్ ఉద్యమానికి ప్రభావితమై 'అన్నల్లో' కలిసేందుకు నిజామాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం,'అన్నల్ని' కలుసుకునేందుకు కొంతకాలం ప్రయత్నించడం… ఆ తర్వాత వాళ్ళను కలవడం,'అన్నలు' ఆమెను ఇన్ ఫార్మర్ గా అనుమానించి హత్య చేయడం ఒరిజినల్ కథ.ఇదే కథను యథాతథంగా చూపితే డాక్యుమెంటరీ అవుతుంది. లేదా 'సమాంతర' సినిమా అవుతుంది. అందువల్ల దర్శకుడు వేణు కథామూలం దెబ్బతినకుండానే జాగ్రత్తగా సినిమాను మలిచాడు.

ఇది దర్శకుని సినిమా.అలాగే ఆనాటి ఉత్తెరతెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల సమాహారంగానూ భావించవచ్చు.తెలంగాణలో ఇపుడు నక్సలైట్ ఉద్యమం లేదు.'అన్నలు' లేరు.కానీ ఆ ఉద్యమం ప్రభావం ఇంకా 'నాగేటి చాళ్లల్లో'ఉన్నది.దాని వల్ల లభించిన 'ఆత్మగౌరవమూ' సజీవంగానే ఉన్నది.తన సహచర దళ సభ్యుల్ని కాల్చి చంపి తుపాకులతో సహా నాటి కరీంనగర్ జిల్లా ఎస్.పీ.తుషార్ ఆదిత్య త్రిపాఠి ఎదుట లొంగిపోయిన కత్తుల సమ్మయ్య ఘటనను అద్భుతంగా చిత్రీకరించారు.పౌరహక్కుల సంఘం నాయకునిగా కనిపించిన విద్యాధరరావును పోలీసులు మఫ్టీలో వచ్చి ఎత్తుకుపోయి చంపిపారేసిన ఘటన వంటివి తెలంగాణాలో అప్పట్లో చాలా జరిగాయి.

జగిత్యాలలో న్యాయవాది రాజన్న,కరీంనగర్ శివారులో పౌరహక్కుల సంఘం నాయకుడు జాపా లక్ష్మరెడ్డి,హన్మకొండలో నర్రా ప్రభాకరరెడ్డి,వారంగల్ జెపిఎన్ రోడ్డులో డాక్టర్ రామనాథం.. హత్యలన్నీ 'రాజ్యం' చేసిన హత్యలే! అటువంటి ఒక ఘటనను 'విద్యాధరరావు' పాత్ర ద్వారా పరోక్షంగా చూపారు.నక్సలిజం నేపథ్యంలో ఇదివరకు కూడా పలు సినిమాలు వచ్చినప్పటికీ 'విరాటపర్వం' భిన్నమైనది.అసలు కథకు వాణిజ్యపు అంశాలను మేళవించి ఓ ప్రేమ కథా చిత్రంగా దర్శకుడు నడిపాడు.నక్సలైట్ల కార్యకలాపాలు,దళాల చర్యలు,నాటి సామాజిక ఆర్ధిక రాజకీయ పరిస్థితులు,నక్సలైట్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆకర్షితులు కావడం వెనుక కారణాలన్నిటినీ మూడు,నాలుగు దశాబ్దాల కిందట ప్రస్తుత మావోయిస్టు పార్టీ,అప్పటి పీపుల్స్ వార్ లో క్రియాశీలంగా పనిచేసిన 'మాజీ' లతో మాట్లాడి 'నోట్స్' రాసుకొని దర్శకుడు వేణు 'స్క్రిప్ట్' సిద్ధం చేసుకున్నాడు.వేణు ఈ సినిమా చిత్రీకరణకు ముందు నక్సలైట్ ఉద్యమాన్ని,ఆ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులతో విస్తృతంగా చర్చించాడని ఒక మాజీ మావోయిస్టు నాయకుడు చెప్పాడు. అందువల్లనే ఉద్యమ గమనాన్ని బాగా హ్యాండిల్ చేశారు.నక్సలైట్ల కదాంశాన్ని సినిమాకు ఎంపిక చేసుకోవడమే గొప్ప సాహసం.అది ఎంతో సున్నితమైన వ్యవహారం.ఏ మాత్రం అటూ ఇటూ కథనం ఒరిగినా విమర్శలు వెల్లువెత్తుతాయి.సినీ ప్రేమికులకు 'విరాటపర్వం'పై ఆసక్తి పెంచడానికి ఈ సినీ యూనిట్ ప్రచారం ఉధృతంగా సాగించింది. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి.మూడు,నాలుగు దశాబ్దాల క్రితం ఏమి జరిగింది? అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రతి ఒక్కరిలో ఉంటుంది.పైగా చాలామందికి తెలియని,అర్ధం కాని మావోయిస్టుల ఉద్యమాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రస్తుత జనరేషన్ లో ఉండడం ఇంకా సహజం.

విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది.ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పులు జరుగుతున్నప్పుడు వెన్నెలకు ఆమె తల్లి(ఈశ్వరీరావు) జన్మనిస్తుంది.ఇరువైపులా తూటాల వర్షం కురుస్తున్న సమయంలో ఆమెకు ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్‌) పురుడు పోస్తుంది.అదేక్షణంలో ఒక తూటా నివేదా తలలోకి దూసుకువెడుతుంది.ఆకాశంలో చంద్రుడు ప్రత్యక్షమవుతాడు. వెన్నెల 1973 లో జన్మించినట్టు సినిమాలో చూపారు.నిజానికి ఆ కాలంలో నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో ఉనికిలోనే లేదు.వెన్నెల పుట్టుక ను సినిమాటిక్ గా చూపే ఉద్దేశంతో తెరపై ఆ సంవత్సరాన్ని ప్రదర్శించారు.వెన్నెల పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడిపోతుంది.ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్‌, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్‌ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది.అసలు కథలో తూము సరళ ఎవరినీ ప్రేమించలేదు.ప్రేమ కోసం ఆమె నక్సలైట్లలో చేరాలనుకోవడం కల్పితం.కల్పన లేకపోతే సినిమా రక్తిగట్టదని దర్శకునికీ తెలుసు.అందుకే 1990 ల్లో పరిస్థితిని,సంఘటనలనూ వివరించేటప్పుడు వాస్తవాలను వక్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది.కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించడు.'ప్రేమ కోసం సమయం లేదంటాడు."ఊపిరికీ,ఊపిరికీ మధ్య ఊపిరి సలుపని యుద్ధం" జరుగుతోందని రవన్న చెబుతాడు.

నక్సలిజం నేపథ్యంలో అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం చాలా కష్టం.ఆ కష్టాన్ని దర్శకుడు వేణు అధిగమించాడు. దర్శకుడు ఎంతో సున్నితంగా,ఎమోషనల్‌గా తెరపై చూపించాడు.'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ' అంటూ సాయిపల్లవి గొంతు సినిమా ప్రారంభంలో మనకు వినిపిస్తుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం,పెరిగిన విధానం,విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం,అతని కోసం కన్నవారిని వదిలి వెళ్లడం.. పోలీసుల చేతికి దొరకడం వంటి సన్నివేశాలు ఇంటర్వెల్ వరకు సాగుతాయి.తన తండ్రిపై పోలీసులు అకారణంగా దాడి చేసినప్పుడు,పోలీసులతో వెన్నెల వాగ్వివాదం ఆకట్టుకునే సన్నివేశం.అదే క్షణం రవన్న దళం అక్కడికి చేరడం పోలీసులపై కాల్పులు జరపడం రానా ఎంట్రీగా చూపుతారు.వెన్నెలగా సాయి పల్లవి తన నటనతో అదరగొట్టింది.భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో రానా తప్పు చేయలేదని ఈ సినిమాతో ప్రేక్షకులకు అర్ధమవుతుంది.

పోలీసుస్టేషన్‌ లాకప్ లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం..ప్రొఫెసర్‌ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథ వేగం పుంజుకుంటుంది.భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి.రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్‌ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం హైలైట్.

ఇక క్లైమాక్స్‌ లో దాదాపు 20 నిముషాలు బాగా నడిపారు.తాను చేయని తప్పుకు వెన్నెల బలైపోయిందనే బాధ సినిమా చివరలో ప్రేక్షకులను వెంటాడుతుంది.దర్శకుడు వేణు స్వయంగా రచయిత.కనుక సినిమాల్లో పళ్ళు సందర్భాల్లో మాటలు తూటాల్లా పేలాయి. 'మా ఊళ్ళల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు,మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు.అన్నలు వచ్చారు.నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్'అని రాహుల్‌ రామకృష్ణ ఎస్పీ ప్రతాప్ (బెనర్జీ)తో అంటాడు.నక్సలైట్లు 1980,90 దశాబ్దాల్లో తెలంగాణలో గొంతు లేని వాళ్లకు గొంతునిచ్చారు.అణచివేతకు గురయ్యే వ్యక్తులకు అండగా నిలబడ్డారు.నక్సలైట్ల రాజకీయాలతో మనం ఏకీభవించవచ్చు. ఏకీభవించకపోవచ్చు.ఆ భావజాలం తెలంగాణ మట్టిలో ఇంకిపోయింది.

'తుపాకీ గొట్టంలో శాంతి లేదు… ఆడపిల్ల ప్రేమలో ఉంది' అని రానా తల్లి జరీనా వాహబ్ అనడం అతకని వాక్యమే అయినా 'కమర్షియల్' విలువల జోడింపుగా భావించాలి.ఏళ్ళ తరబడి అజ్ఞాతవాసంలో ఉండే మావోయిస్టులు తమ కుటుంబసభ్యులు ఎన్ని కష్ట, నష్టాల్లో ఉన్నా వాళ్ళను కలుసుకునే ప్రయత్నం చేయడం అత్యంత అరుదు.ఎందుకంటే అది ఆత్మహత్యాసదృశ్యం అని మావోయిస్టులకు తెలుసు.ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేస్తున్నావాళ్ళలో మూడు దశాబ్దాలకు పైగా రహస్య జీవితం గడుతున్నారు.తమ తల్లి దండ్రులు చనిపోయినా చివరి చూపుకురాని ఉదంతాలెన్నో ఉన్నవి.ఇది సినిమా కనుక తల్లి కొడుకును చూడాలనుకుంటున్న సంగతి తెలుసుకొని అడవిని వదలి పట్టణానికి వెళ్లి తల్లిని కలవడం,పోలీసులకు ఈ సమాచారం అంది చుట్టూ ముట్టడం,పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ తప్పించుకోవడం వంటి సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు.

'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు', 'రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది', నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా' లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి.వెన్నెల పాత్రను సృష్టించినపుడే సాయి పల్లవి ఊహించుకున్నట్టు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వేణు చెప్పాడు. ఆయన అంచనాలను మించి ఆమె నటించింది. రానా నక్సలైట్ పాత్రను శక్తివంతంగా పోషించాడు.

ఈ జనరేషన్ కు వామపక్ష తీవ్రవాద భావజాలం గురించి ఎక్కువగా తెలియనందున ,లేదా అనుభవంలోకి రానందున వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు బాగా కనెక్టు అవుతుంది.వాళ్ళు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎలాంటి సందేశం ఇవ్వడు.మావోయిస్టు భావజాలాన్ని సమర్ధించడు.వ్యతిరేకించడు.సినిమా చివరలో సాయిపల్లవి 'కోవర్టు' పనిచేస్తున్నట్టుగా వచ్చిన ఆరోపణలకు బలమైన కొన్ని సాక్ష్యాధారాలను ఏకరువు పెట్టె ప్రయత్నం జరుగుతుంది.అయితే ఆ సాక్ష్యాధారాలన్నీ బూటకమని 'నర్సన్న కమిటీ' నుంచి ఒక లేఖ అందే సమయానికి… దళసభ్యురాలు సాయిపల్లవిని రానా కాల్చి చంపేస్తాడు.అక్కడితో సినిమా ముగుస్తుంది.

సినిమా మధ్యలో ఒక చోట దళితులు,బహుజన వర్గాల టాపిక్ ఉంటుంది.నక్సలైట్ల దళంలో ఉన్న వాళ్ళంతా ఆయా వర్గాల వారేనని,నాయకత్వస్థాయికిలో ఉన్నవాళ్లు అగ్రకులాల వాండ్లు అని ఎస్పీ ప్రతాప్(బెనర్జీ ), వెన్నెల తండ్రి సాయిచంద్ తో అంటాడు.ఇలాంటి అభిప్రాయం సాధారణంగా ప్రచారంలో ఉన్నదే.వాస్తవమేమిటో మావోయిస్టు పార్టీకి ఆ పార్టీ రాజకీయాలను విశ్వసించే వాళ్లకు మాత్రమే తెలుసు.

Tags:    
Advertisement

Similar News