ఈ టీవీలను ఎంచక్కా నాకేయొచ్చు.. జపాన్ లో టేస్ట్ ద టీవీ..
ఆధునిక సాంకేతికతకు నిదర్శనం టీవీ. టెలివిజన్ చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి, తెరలు మారాయి, త్రీడీ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇప్పుడు అంతకు మించి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఏకంగా రుచి చూసే టీవీని అనుభవంలోకి తీసుకొచ్చారు. ఆ టీవీ తెరను ఎంచక్కా నాకేయొచ్చనమాట. టీవీ తెరపై కనిపించే వస్తువులను కళ్లతో చూడటమే కాదు, వాటి టేస్ట్ ని కూడా చూడొచ్చు. దీని పేరే టేస్ట్ ద టీవీ(TTTV). జపాన్ లో ఇది లేటెస్ట్ సెన్సేషన్. మీజి […]
ఆధునిక సాంకేతికతకు నిదర్శనం టీవీ. టెలివిజన్ చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి, తెరలు మారాయి, త్రీడీ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇప్పుడు అంతకు మించి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఏకంగా రుచి చూసే టీవీని అనుభవంలోకి తీసుకొచ్చారు. ఆ టీవీ తెరను ఎంచక్కా నాకేయొచ్చనమాట. టీవీ తెరపై కనిపించే వస్తువులను కళ్లతో చూడటమే కాదు, వాటి టేస్ట్ ని కూడా చూడొచ్చు. దీని పేరే టేస్ట్ ద టీవీ(TTTV). జపాన్ లో ఇది లేటెస్ట్ సెన్సేషన్.
మీజి యూనివర్శిటికి చెందిన హోమీ మియాషిత అనే శాస్త్రవేత్త 30మంది విద్యార్థులతో కలసి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. టేస్ట్ ద టీవీ అనే కాన్సెప్ట్ ని తయారు చేశారు. ప్రస్తుతం దీని ధర లక్ష యెన్ లు. భారత కరెన్సీలో దాదాపు 66వేల రూపాయలుగా ఉంటుందని చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుంది..?
టేస్ట్ ద టీవీ కాన్సెప్ట్ లో టీవీతోపాటే.. ఓ మిషన్ ని అందుబాటులో ఉంచుతారు. దానిలో 10రకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని నింపుతారు. తెరపై కనిపించే ఆహార పదార్థంపై దానికి సంబంధించిన ఫ్లేవర్ స్ప్రే అవుతుంది. ఆ తర్వాత దాన్ని మనం టేస్ట్ చేస్తే సరిగ్గా ఆ ఆహార పదార్థాన్ని తిన్న అనుభూతి మిగులుతుంది.
ఎందుకీ టేస్టీ టీవీ..?
కరోనా కాలంలో అందరూ ఇంటి తిండికే అలవాటు పడ్డారు. హోటళ్లకు వెళ్లడం సాధ్యం కాలేదు. కనీసం హోటళ్లనుంచి పార్సిళ్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. యూట్యూబ్ లో చూసి వంటలు వండినా ఆ టేస్ట్ వస్తుందో లేదో తెలియదు. ఇలాంటి వారికోసం ఈ టేస్ట్ ద టీవీని రూపొందించినట్టు తెలిపారు జపాన్ సైంటిస్ట్ హోమీ మియాషిత. వంటపై డిస్టెన్స్ కోర్సులు నేర్చుకునేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారాయన. టేస్టింగ్ గేమ్స్, క్విజ్ లు వంటివాటికి కూడా ఇది పనికొస్తుందట. ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలపై వివిధ రకాల ఫ్లేవర్లను చల్లుకుని ఆ రుచిని చక్కగా ఆస్వాదించేందుకు కూడా ఇందులో ప్రత్యేక అమరిక ఉంది. మొత్తమ్మీద టీవీ తెరను చూడటమే కాదు, నాకేయొచ్చని కూడా చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ముందు ముందు మరెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.