ది గ్రేట్‌ ఇండియా మోడీ ట్రిక్‌ (వ్యంగ్యం)

మోడీ ప్రెస్‌ మీట్‌ టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని ఎందుకు చేర్చుకున్నారు? – విలేకరుల ప్రశ్న. “బిజెపి గంగానది లాంటిది. దాంట్లో ఎంత చెత్త కలిసినా, గంగ పవిత్రతకి లోటు లేదు” మోడీ జవాబు. “మా ప్రశ్నకి ఇది కాదు సమాధానం” “మా పార్టీలో ప్రతిదీ మైక్రోస్కోప్‌ పెట్టి వెతకాలి. వెతికితే సమాధానం దొరుకుతుంది” “అర్థమైంది. పులిని లొంగదీసుకోవాలంటే కొరడా ఉండాలి. మీ చేతిలో ఈడి వుంది” “ఈడి రూపంలో మోడీ, మోడీ రూపంలో ఈడీ” “మీది విలువలుగల […]

Advertisement
Update:2019-06-27 01:30 IST

మోడీ ప్రెస్‌ మీట్‌

  • టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని ఎందుకు చేర్చుకున్నారు? – విలేకరుల ప్రశ్న.

“బిజెపి గంగానది లాంటిది. దాంట్లో ఎంత చెత్త కలిసినా, గంగ పవిత్రతకి లోటు లేదు” మోడీ జవాబు.

  • “మా ప్రశ్నకి ఇది కాదు సమాధానం”

“మా పార్టీలో ప్రతిదీ మైక్రోస్కోప్‌ పెట్టి వెతకాలి. వెతికితే సమాధానం దొరుకుతుంది”

“అర్థమైంది. పులిని లొంగదీసుకోవాలంటే కొరడా ఉండాలి. మీ చేతిలో ఈడి వుంది”
“ఈడి రూపంలో మోడీ, మోడీ రూపంలో ఈడీ”

  • “మీది విలువలుగల పార్టీ కదా, చెత్తని ఎలా చేర్చుకున్నారు”

“స్వచ్ఛభారత్‌ అంటే చెత్తని క్లీన్‌ చేయడం. అవతలి పార్టీలోని చెత్తని క్లీన్‌ చేశాం”

  • “కానీ ఆ చెత్త మీలో కలిసింది కదా”

“చెప్పాను కదా, మా పార్టీ గంగానది అని”

  • విలేకరులు బుర్ర గోక్కుని… “డిమానిటైజేషన్‌ వల్ల ఏమన్నా ఒరిగిందా?” అని అడిగారు.

“డిమానిటైజేషన్‌ వల్ల కేరక్టరైజేషన్‌ పెరిగింది” అన్నాడు మోడీ.

విలేకరులు మోకాళ్ళు, బుర్ర ఏకకాలంలో గోక్కున్నారు.

“మన చేతిలో ఉన్న వెయ్యినోటు అశాశ్వతమని జనం గుర్తించారు. డబ్బుపైన కోరిక చచ్చిపోతే క్యారెక్టర్‌ బతుకుంది”

  • “దానివల్ల అభివృద్ధి ఏమైనా జరిగిందా?”

“అభివుధ్ది అనేది బ్రహ్మ పదార్ధం. శతాబ్దాలుగా మునులు, ఋషులు దానికోసం శోధిస్తున్నారు. నేను కూడా కేదార్ నాథ్‌ గుహలో అన్వేషించాను. అది లేదని అనలేం… ఎక్కడుందంటే చూపించలేం. దీన్నే భార రహిత స్థితి అంటాం”

  • “రాజ్య సభ సభ్యుల చేరిక, చంద్రబాబు కుట్ర అని ఒక ప్రచారం ఉంది నిజమేనా?”

“చంద్రబాబు మాయల ఫకీరైతే, అలాంటి వందమంది మాయల ఫకీర్లకి నేను గురువుని. బాబు ప్రాణం వుంచిన చిలుక ఇప్పుడు నా పంజరంలో ఉంది. అయినా నేను శ్రీకృష్ణుడి లాంటి వాణ్ణి. యుద్ధం చేయను…. చేయిస్తా”

  • “మీ తర్వాతి చర్య ఏంటి?”

“ఏదో ఒక సెన్సేషన్‌ లేకపోతే జనంలో ఎమోషనుండదు. అందుకు లెఫ్టిస్ట్‌ ల మీద పడదామనుకుంటున్నా”

  • “మూలిగే నక్కమీద తాటిపండు ఎందుకు?”

“మూలిగే నక్క మూలుగులు లేపేయాలనేది నా సిద్ధాంతం. అందుకే జనంలో లెఫ్ట్‌ బావజాలమే లేకుండా ఉండేందుకు, ఇక పై అన్ని వాహనాలు లెఫ్ట్‌లో కాకుండా రైట్‌లో వెళ్ళేలా చేస్తా”

  • “దాని వల్ల ప్రయోజం?”

“బ్రిటిష్‌ వారి వారసత్వం వదులుకుని, అమెరికాని అనుసరిస్తున్నామని అందరికీ అర్థమయ్యేలా చేయడం”

  • “జనానికి ఇబ్బంది కదా?”

ఇబ్బందులకి జనం ఎప్పుడో అలవాటు పడ్డారు”

ప్రెస్‌ మీట్‌ ముగిసింది

-జి.ఆర్‌.మహర్షి

Tags:    
Advertisement

Similar News