జమిలికి కొందరు సై... మరికొందరు నై...

ఒకే దేశం… ఒకే ఎన్నికలు అంశంపై వివిధ రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరగాలని నిర్ణయించినా ఎక్కువ సమయాన్ని దేశంలో జమిలి ఎన్నికలపైనే కేటాయించడం విశేషం. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ […]

Advertisement
Update:2019-06-19 23:33 IST

ఒకే దేశం… ఒకే ఎన్నికలు అంశంపై వివిధ రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరగాలని నిర్ణయించినా ఎక్కువ సమయాన్ని దేశంలో జమిలి ఎన్నికలపైనే కేటాయించడం విశేషం. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు హాజరు కాలేదు.

సమావేశానికి హాజరుకాని పార్టీలలో డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ వంటివి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర్ర సమితి నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.

ఇక ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, సిపిఐ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం నుంచి సీతారాం ఏచూరి, శరద్ పవార్ వంటి దిగ్గజ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి హాజరుకావాల్సిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా సమావేశానికి హాజరు కాలేదు. అయితే ఆ పార్టీ అభిప్రాయాన్ని మాత్రం ఓ లేఖలో పొందుపరిచి అధికారులకు అందజేశారు.

ఈ సమావేశంలో ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర్ర సమితి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ జమిలి ఎన్నికలకు తమ అంగీకారాన్ని తెలిపాయి.

అయితే సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమని, రాజ్యాంగపరంగా సమస్యలు వస్తాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. తమ అభిప్రాయంతో సిపిఎం, ఎంఐఎంలు కూడా ఏకీభవించాయని సురవరం సుధాకర రెడ్డి చెప్పారు.

ఇక దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించదలచిన కార్యక్రమాలు, మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలలో భాగంగా దేశంలోని 150 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసి అవార్డులివ్వాలని తెలంగాణ రాష్ట్ర్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే 24 పార్టీలకు చెందిన ప్రతినిధులే హాజరయ్యారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు.

Tags:    
Advertisement

Similar News