బీజేపీపై హిందువుల తిరుగుబాటు
బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ నుంచి మన దేశానికి వలస వచ్చిన హిందువులకు సరైన పత్రాలు లేకపోయినా పౌరసత్వం కట్టబెట్టడానికి ఉద్దేశించిన 2016 నాటి పౌరసత్వ (సవరణ) చట్టం ఆమోదం పొందకుండానే మురిగి పోనుంది. ఎందుకంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13న) నిరవధికంగా వాయిదా పడ్డాయి. మరో మూడు నెలల కాలంలో ఎన్నికలు జరిగి కొత్త పార్లమెంటు ఏర్పడే దాకా పార్లమెంటు సమావేశాలు జరగడానికి అవకాశం లేదు కనక ఈ బిల్లుకు కాలదోషం పట్టడం ఖాయం. […]
అస్సాంలోని బరాక్ లోయ ప్రాంత హిందువులు మొదట్లో బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును గట్టిగా సమర్థించారు. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువుల దగ్గర సరైన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా బరాక్ లోయలోని హిందువులు మాత్రం సమర్థించారు. “స్వదేశీ” సమూహాలకు చెందిన వారు ఈ బిల్లు బంగ్లా దేశ్ నుంచి వలస వచ్చిన బెంగాలీ హిందువులకు పౌరసత్వం కట్టబెడ్తుంది గనక స్థానిక ప్రజలు తమ సంస్కృతికి విఘాతం కలుగుతుందని భావించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కానీ కచర్, కరీం గంజ్, హైలాకుండి ప్రాంతాలతో కూడిన బరాక్ లోయలో బెంగాలీ హిందువులు ఎక్కువ మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వాతంత్ర్యానంతరం అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారే. ఈ బిల్లు మీద స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు ఇతర ప్రాంతాలలోని వారు బిల్లును వ్యతిరేకిస్తే బరాక్ లోయ వారు మాత్రం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును గట్టిగా సమర్థించారు. బిల్లు తమకు అనుకూలం అని బరాక్ లోయలోని వారు భావించారు. ఈ బిల్లుకు లోకసభ ఆమోదం లభించింది. దీనిని బడ్జెట్ సమావేశాలలో రాజ్య సభలో ప్రతిపాదించవలసింది. అయితే అక్కడ చర్చకే రాలేదు. అందువల్ల బీజేపీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ బిల్లు ప్రస్తావన తెచ్చి చివరకు ఆమోదించకుండా నాటకాలాడిందని బరాక్ లోయ ప్రాంత వాసులు భావిస్తున్నారు.
“దేశ విభజన సమయంలో జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నాం” అని జనవరి నాలుగున సిల్చార్ లో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ గంభీరంగా ప్రకటించారు. కడకు ఈ బిల్లును ఆమోదించకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. “రాజకీయ ప్రయోజనాలకోసమే బీజేపీ ఈ బిల్లు ప్రతిపాదించింది” అని పౌరుల హక్కుల పరిరక్షణ కమిటీకి చెందిన సాధన్ పురకాయస్థ విమర్శిస్తున్నారు. బిల్లుకు అనుకూలంగా అప్పుడు సంయుక్త పార్లమెంటరీ సంఘానికి ఈ సంస్థ విజ్ఞాపన పత్రం కూడా అందజేసింది. “దేశ విభజన సమయంలో వలస వచ్చిన వారిని ఆదుకోవడం బీజేపీ ఉద్దేశం కదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, బీజేపీని ఖండిస్తున్నాను” అని పురకాయస్థ దుయ్యబట్టారు. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 3తో ముగుస్తుంది. ఆలోగా మళ్లీ పార్లమెంటు సమావేశమయ్యే అవకాశం లేదు.
“ఈ బిల్లు ఓ రాజకీయ ఎత్తుగడ. ఇది అస్సాం ప్రజలకు మేలు కన్నా కీడే ఎక్కువ చేసింది. ఇది బరాక్ లోయ ప్రాంత వాసులను, బ్రహ్మపుత్ర లోయ వాసులను విడదీయడానికే ఉపకరించేట్టు ఉంది” అని బరాక్ లోయలో 43 సమాజాలను ఒక్క చోట చేర్చే ఛత్రంలాంటి “పౌరుల హక్కుల పరిరక్షణ సమన్వయ సమితి అధ్యక్షుడు తపోధిర్ భట్టాచార్జీ అంటున్నారు. ఆయన అస్సాం విశ్వవిద్యలయం మాజీ వైస్ చాన్స్ లర్.
బరాక్ లోయలో బెంగాలీలు ఎక్కువ మంది ఉంటారు. బ్రహ్మపుత్ర లోయలో అస్సామీలు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. బరాక్ లోయ ప్రాంత వాసులు బిల్లుని సమర్థిస్తే బ్రహ్మపుత్ర వాసులు వ్యతిరేకించారు. బిల్లుకు కాలదోషం పట్టే పరిస్థితి అనివార్యమైనందువల్ల ఈ రెండు ప్రాంతాల వారి మధ్య వైరం మరింత పెరిగే అవకాశం ఇనుమడించింది. బీజేపీ అనవసరంగా ఈశాన్య ప్రాంతంలోని రెండు వర్గాల ప్రజల మధ్య వైరం పెంచింది. అనవసర గందరగోళ పరిస్థితికి కారణం అయింది” అని పురకాయస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిల్లును ఆమోదించనందువల్ల సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బ తింటాయని ఆయన అంటున్నారు. “బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తోంది తప్ప దేశ విభజన బాధితుల సమస్యలను పరిష్కరించడం ఆ పార్టీ ఉద్దేశం కాదు” అని ఆయన దుయ్యబట్టారు. అయితే బిల్లు ఆమోదం పొందనందువల్ల బీజేపీకి ఎన్నికలలో పెద్దగా నష్టం ఏమీ ఉండదని, అది నైతిక పరాజయం మాత్రమే కావచ్చునని ఈశాన్య ప్రాంతంలోని హిందువులు బీజేపీని సమర్థించే అవకాశాలే ఎక్కువ అని సిల్చార్ లోని రాజకీయ వ్యాఖ్యాత జయదీప్ బిస్వాస్ వాదిస్తున్నారు.
లోకసభలో తమకు సంఖ్యా బలం ఉన్నందువల్ల బిల్లును ఆమోదింప చేశామని, సమయం చిక్కనందువల్ల, మెజారిటీ లేనందువల్ల రాజ్యసభ ఆమోదం సంపాదించలేకపోయామని బరాక్ లోయలోని బీజేపీ సమర్థకులు సర్ది చెప్పుకుంటున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీలు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలి చాలా సమయం వృధా చేశారని కూడా వారు ఆరోపిస్తున్నారు.