డాకీ.... ఛూ మంతర్ కాళి!
మాయాలేదు, మత్రం లేదు. మర్మం అంతకన్నా లేదు. పై ఫొటో మనింట్లో బకెట్‌లో ఉన్న కాగితం పడవ కాదు. నిజమైన పడవ. నదిలో విహరిస్తున్న పడవ. గాల్లో తేలుతున్నట్లు విహరిస్తున్న అనుభూతినిస్తున్న పడవ. నిజమే… ఇది నీటిలో తేలుతున్న పడవ. కానీ ఫొటోలో పడవ నీడ కూడా స్పష్టంగా త్రీడీ ఇమేజ్‌ను తలపిస్తోంది కదూ! ఈ మధ్య చాలా డెస్క్‌టాపుల మీద కూడా కనిపిస్తోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమో అనే భ్రమను కలిగిస్తుంటుంది. అలాంటి పడవ ప్రయాణం […]
మాయాలేదు, మత్రం లేదు. మర్మం అంతకన్నా లేదు. పై ఫొటో మనింట్లో బకెట్‌లో ఉన్న కాగితం పడవ కాదు. నిజమైన పడవ. నదిలో విహరిస్తున్న పడవ. గాల్లో తేలుతున్నట్లు విహరిస్తున్న అనుభూతినిస్తున్న పడవ.
నిజమే… ఇది నీటిలో తేలుతున్న పడవ. కానీ ఫొటోలో పడవ నీడ కూడా స్పష్టంగా త్రీడీ ఇమేజ్‌ను తలపిస్తోంది కదూ! ఈ మధ్య చాలా డెస్క్‌టాపుల మీద కూడా కనిపిస్తోంది.
కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమో అనే భ్రమను కలిగిస్తుంటుంది. అలాంటి పడవ ప్రయాణం చేయాలంటే డాకీకి వెళ్లాల్సిందే.
ఢాకా కాదు ఢాకీనే!
మనకు పొరుగున బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తెలుసు కానీ, బంగ్లాదేశ్‌కి కూతవేటు దూరంలో ఉన్న ఢాకీ గురించి తెలియదు. ఇది మేఘాలయలో ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 90 కి.మీ.ల దూరం. ఉమ్న్‌గాట్ నది తీరాన ఉంది ఈ పట్టణం.
ఇది నిజానికి పల్లె. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో ఒక మోస్తరు పట్టణం రూపం సంతరించుకుంది. ఇంకా చెప్పాలంటే ఢాకీ ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్. డాకీ దగ్గర దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోవచ్చు. దేశ సరిహద్దు దాటడం ఇంత సులువా అని ఆశ్చర్యం వేస్తుంది కూడా.
మనకు పశ్చిమాన ఉన్న పాకిస్థాన్ సరిహద్దు అయితే ఇనుప తీగల ఫెన్సింగ్, నిత్యం సైనికుల గస్తీ ఉంటుంది. పొరపాటున కంచె దగ్గరకు వెళ్లినా సరే సమాధానం చెప్పి ఆధారాలు చూపించి బయటపడాల్సి వస్తుంది. అదే తూర్పున ఉన్న బంగ్లాదేశ్‌తో అలాంటి కష్టాలుండవు. ఇక్కడ కంచె కూడా ఉండదు. ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహం ఉంటే సైనిక శక్తి మీద ఆధారపడాల్సిన పనే ఉండదని నిరూపిస్తుంటుంది ఈ సరిహద్దు.
డాకి- తమాబిల్ సరిహద్దుతోపాటు మరికొన్ని సరిహద్దులు కూడా ఉన్నాయి. రొటీన్ చెక్ పాయింట్స్ ఉంటాయి.
జైనితాల్ హిల్స్
నైనితాల్ కాదు, జైనితాలే. ఉమ్న్‌గాట్ నది, డాకీ గ్రామం చుట్టూ ఉండే కొండలను జైనితాల్ కొండలంటారు. షిల్లాంగ్ నుంచి డాకీ చేరే దారిలో ఈ కొండల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. డాకీలో బస కొంచెం కష్టమే.
షిల్లాంగ్‌లో విడిది చేసి ఉదయం బయలుదేరి ఢాకీ చేరుకుని సాయంత్రం వరకు అడ్వెంచర్ స్ట్పోర్ట్స్, నదిలో పడవ ప్రయాణం వంటి సరదాలను సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి రాత్రికి షిల్లాంగ్ చేరవచ్చు. పర్వత ప్రాంతం కావడంతో తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటలు పడుతుంది.
హ్యాంగింగ్ బోట్
మేఘాలు పర్యాటకు చేతికందడానికే వచ్చినట్లు దగ్గరగా వచ్చి ఆటపట్టిస్తుంటాయి. నీటి కొలనులో మరకతాలను పోసినట్లు ఉంటుంది పచ్చదనం. పచ్చటి అడుగు, స్వచ్ఛమైన నీటి మీద పడవ ప్రయాణం చేస్తుంటే గాల్లో తేలినట్లే ఉంటుంది.
పడవ ఏ ఆధారమూ లేకుండా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. నేల కనిపిస్తుంటుంది, మనం నేల మీద ఉన్నామనే భావన కలగదు, నీటి మీద ఉన్నా సరే… నీటి మీద తేలుతున్నట్లు అనిపించదు, నేలను తాకడానికి ప్రయాణిస్తున్నట్లు… ఆ భావనే పులకింప చేస్తుంది.
ఇంత అందమైన నదికి చిన్నపాటి వరద వచ్చినా సరే పరిస్థితి కకావికలమై పోతుంది. అందుకే ఈ జోన్‌కి వర్షాకాలం వెళ్లకూడదు. దట్టమైన మేఘాలతో నిండిన ఆకాశాన్ని, మంద్రంగా పారే నదుల గమనాన్ని ఆస్వాదించాలంటే శీతాకాలమే బెస్ట్.
వింటర్ ఫెస్టివల్స్
శీతాకాలం పర్యాటకుల కోసం ఇక్కడ ప్రత్యేకమైన వేడుకలుంటాయి. తైనిమ్ ఫెస్టివల్, బాఘ్‌మారా ఫెస్ట్, పింజెరా ఫెస్ట్, విలియం నగర్-తురా వింటర్ ఫెస్టివల్‌లు ఏటా డిసెంబర్‌లో జరుగుతాయి.
ఈ ట్రిప్‌లో చిరపుంజిని మిస్ కాకూడదు. ఢాకీ కి సమీప విమానాశ్రయం అస్సాం రాజధాని గువాహటిదే. గువాహటి ఎయిర్‌పోర్ట్ నుంచి 175 కి.మీ.లు ఉంటుంది. ప్రయాణానికి ఐదు గంటలు పడుతుంది.
-మంజీర