కఠువా మనలను వెంటాడాలి
ఒక అఘాయిత్యం ప్రజలకు ఎంతకాలం గుర్తుంటుంది? కఠువాలో ఓ పసి కూనను పోలీసులతో సహా కొందరు పురుషులు కలిసి అపహరించి, అత్యాచారం చేసి, కిరాతకంగా ప్రవర్తించి, చివరకు హతమార్చిన సంఘటన ప్రజల మదిలో చాలా కాలం ఉంటుందని, సమాజ వైఫల్యానికి గుర్తు మిగిలిపోతుందని అనుకుంటాం. ఆ బాలిక మీద అఘాయిత్యం చేసినవారు మత విద్వేషంతో వ్యవహరించారు. ఆమె గిరిజన బాలిక, పైగా ముస్లిం. ఈ ఘోరం చాలదన్నట్టు హిందూ ఏక్తా మోర్చా అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణ ఉన్న […]
ఒక అఘాయిత్యం ప్రజలకు ఎంతకాలం గుర్తుంటుంది? కఠువాలో ఓ పసి కూనను పోలీసులతో సహా కొందరు పురుషులు కలిసి అపహరించి, అత్యాచారం చేసి, కిరాతకంగా ప్రవర్తించి, చివరకు హతమార్చిన సంఘటన ప్రజల మదిలో చాలా కాలం ఉంటుందని, సమాజ వైఫల్యానికి గుర్తు మిగిలిపోతుందని అనుకుంటాం. ఆ బాలిక మీద అఘాయిత్యం చేసినవారు మత విద్వేషంతో వ్యవహరించారు. ఆమె గిరిజన బాలిక, పైగా ముస్లిం. ఈ ఘోరం చాలదన్నట్టు హిందూ ఏక్తా మోర్చా అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణ ఉన్న వారికి మద్దతుగా వీధికెక్కి ఊరేగింపే తీశారు.
ఈ ఘటన పర్యవసానంగా మన జాతి, మన సమాజం ఎటు వెళ్తోంది అన్న ఇరకాటంలో పడవేసే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని చూసిన వారికి, ఆ బాలిక ఫొటోలు చూసిన వారికి ఇది కేవలం ఊహకందని విషయం కాదనీ, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని అనిపించింది. ఆ బాలిక చిత్రాలు అన్ని చోట్లా, ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో విస్తారంగా కనిపించాయి. అమాయకమైన ఆ ముఖం ఆమెకు న్యాయం కలగాలని గట్టిగా కోరడానికి ఉపకరించింది.
ఈ దారుణం జరిగింది కొద్ది నెలల కిందే అయినా కఠువా జనం మదిలోంచి ఈ చేదు జ్ఞాపకం క్రమంగా చెదిరిపోతోంది. దారుణాలు మనను కలచి వేస్తాయి. కాని వాటిని మరిచిపోయేదీ మనమే. ప్రజల మదిలో మెదిలే అంశాల ఆధారంగానే జాతీయ, ప్రాంతీయ అస్తిత్వాలు రూపుకడ్తాయి. అవే జాతీయా భావాలను ప్రోది చేస్తాయి. అస్తిత్వాన్ని, రాజకీయ వ్యవస్థను రూపుదిద్దడంలో జ్ఞాపకాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాని జాతి వేటిని గుర్తుంచుకుంటుంది? వేటిని విస్మరిస్తుంది?
ప్రజల మనసుల్లో చెదిరిపోకుండా ఉన్న అంశాలే అధికారంలో ఉన్న పక్షం వాదనలకు ఊతం ఇస్తాయి. కఠువా సంఘటనను గుర్తుంచుకోవడం అధికారంలో ఉన్న పక్షానికి అనుకూలమైన అంశమేమీ కాదు. అయితే దీనివల్ల ప్రతిపక్షాలకూ అంతగా ప్రయోజనం ఏమీ లేదు. కఠువా దుర్ఘటనను ఓట్ల కింద మార్చుకోవడం కుదరక పోవచ్చు.
అయితే ప్రజలు ఏ అంశాన్ని గుర్తుంచుకుంటారు అన్నది అధికారంలో ఉన్నది ఎవరు అన్న విషయంపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వం, మీడియా, పౌరులు దేని గురించి ఆలోచిస్తున్నారన్నదే ప్రధానం. ఒక అంశం ఏ మేరకు చర్చనీయాంశం అవుతుందన్న అంశం మీదే ప్రజలు ఏం జ్ఞాపకం ఉంచుకుటారో ఆధారపడి ఉంటుంది. జాతి ఒక అంశాన్ని మరిచిపోతే బాగుండేది అని అధికారంలో ఉన్నవారు అనుకునే అంశం మీదే మీడియా, పౌరులు దృష్టి కేంద్రీకరించవచ్చు.
కఠువా సంఘటనను గుర్తుంచుకుంటే అఘాయిత్యానికి గురైన బాలికకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కఠువా దురంతాన్ని గుర్తుంచుకోవడం పౌర సమాజానికి అవసరం. దాని పర్యవసానాలేమిటో కూడా పౌర సమాజం గుర్తుంచుకోవాలి. అయితే మనలను ఆందోళనకు గురి చేసే అంశాలు ఎన్ని అనే విషయం మీద కూడా ఏది ఎక్కువగా గుర్తుంచుకుంటామో అన్నది ఆధారపడి ఉంటుంది. ఒక ఉదంతానికి సంబంధించి అదనపు సమాచారం వెలువడితే అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆ సంఘటన చారిత్రక విశిష్టతనైనా అంచనా వేయాలి. అయితే గుర్తుంచుకునేట్టు చేయవలసిన బాధ్యత ఎవరిది?
కఠువా సంఘటన స్మృతిపథంలోంచి చెదిరిపోకుండా చూడవలసిన బాధ్యత మీడియాదే అనే వాళ్లు ఉండవచ్చు. ఈ విషయంలో మీడియా విఫలం కాలేదు. ఈ దారుణ సంఘటనలో నిందితుడైన ఒక వ్యక్తి రెండో సారి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని అక్టోబర్ అయిదవ తేదీననే కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ దారుణం మన స్మృతిపథంలోనుంచి చెరిగిపోవచ్చు. ఆందోళన తీవ్రత కూడా పలచబడవచ్చు. మన జాతి అస్తిత్వాన్ని రూపొందించడానికి కఠువా ఉదంతం అంతగా తోడ్పడదు. అది మనం సిగ్గుపడేట్టు చేస్తుంది. ఇది జాతి నిర్మాణానికి సంకేతంగానూ ఉపకరించదు.
2012 డిసెంబర్ 16న దిల్లీలో జ్యోతీ సింగ్ మీద జరిగిన అత్యాచారంతో పోల్చి చూస్తే కఠువా మన మనస్సులను అంతగా ఎందుకు కలచి వేయలేదు? దిల్లీ సంఘటన లాగే కఠువా సంఘటన కూడా మన జాతికి తలవంపులు తెచ్చేదే. అది మనం ఆత్మ పరిశీలన చేసుకునేట్టు చేస్తుంది.
ఒక సంఘటన ఎక్కువ కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయి మరొకటి స్మృతిపథంలోంచి ఎందుకు తొలగిపోతుంది? ఎందుకంటే దిల్లీ సంఘటన వ్యవస్థను కదిలించింది. కఠువా సంఘటన విషయంలో అలా జరగలేదు. మొదటి సంఘటన మహా నగరంలో జరగడం, రెండవ సంఘటన గ్రామీణ ప్రాంతంలో జరగడం దీనికి కారణమా? లేదా బాధితుల సామాజిక-రాజకీయ నేపథ్యాలు భిన్నమైనవి కావడం కారణమా? బహుశా కఠువా సంఘటనలో అత్యాచారం అంశాన్ని మతం కప్పేసిందేమో! ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో మత వ్యవహారం రాజకీయ పక్షాలకు పెద్దగా తోడ్పడదు.
అయితే మన బాధ, భావాలు నిర్మాణాత్మకంగా ఉండాలంటే మన ఉమ్మడి వైఫల్యాలను సమాధి చేసేయ కూడదు. మన సమాజాన్ని కుదిపేసిన కఠువాలాంటి దుర్ఘటనలు మన ఆత్మ పరిశీలనకు ఉపయోగపడాలి. అది సమాజం ఉమ్మడి బాధ్యత. మనం మరిచిపోతే మన తరఫున వకాల్తా పుచ్చుకునే వారి వాదనలను తిప్పికొట్టడం సాధ్యం కాదు. మనం మరిచిపోతే హేయమైన ఈ దారుణాలు, హింస మామూలు అయిపోతాయి. అందుకని ఇలాంటి దారుణాలను గుర్తుంచుకోవడం మన ఉమ్మడి బాధ్యత.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)