కేవీపీ లేఖ వెనుక ఉద్దేశం ఏమిటి?
ఏపీ రాజధాని అమరావతికి కూడా చెన్నై తరహాలో వరద ముప్పు పొంచి ఉందంటూ కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 9 ప్రశ్నలతో కూడిన లేఖ రాసిన కేవీపీ అందులో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రభావానికి లోనయ్యే ప్రాజెక్టుకు కేంద్రపర్యావరణ శాఖ ఎలా అనుమతులిస్తుందని లేఖలో ప్రశ్నించారు. అమరావతి సమీపంలోని కొండవీటివాగు వల్ల 15 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని సీఆర్‌డీఏ అధికారికంగా తెలిపిందని లేఖలో వివరించారు. అలాంటి […]
ఏపీ రాజధాని అమరావతికి కూడా చెన్నై తరహాలో వరద ముప్పు పొంచి ఉందంటూ కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 9 ప్రశ్నలతో కూడిన లేఖ రాసిన కేవీపీ అందులో పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
పర్యావరణ ప్రభావానికి లోనయ్యే ప్రాజెక్టుకు కేంద్రపర్యావరణ శాఖ ఎలా అనుమతులిస్తుందని లేఖలో ప్రశ్నించారు. అమరావతి సమీపంలోని కొండవీటివాగు వల్ల 15 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని సీఆర్‌డీఏ అధికారికంగా తెలిపిందని లేఖలో వివరించారు. అలాంటి వరద సంభవించే ప్రాంతంలో రాజధాని నిర్మాణం సబబేనా అని ప్రశ్నించారు. చెన్నై, శ్రీనగర్, ఉత్తరాఖండ్ వరదలను చూసిన తర్వాతనైనా దీనిపై ఆలోచన చేయాలన్నారు.
ప్రస్తుత ప్రాంతంలో రాజధాని వల్ల పర్యావరణంతో పాటు పక్కనే ఉన్న కృష్ణా నది కూడా దెబ్బతింటుందని కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. నదీ పరీవాహక ప్రాంతం కాంక్రీటుమయమైతే చెన్నై తరహాలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని కేవీపీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు,పార్కులకు, వాణిజ్య కేంద్రాలకు, పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఉందంటూ పర్యావరణ క్లియరెన్స్‌లో తెలిపారని గుర్తు చేశారు. కానీ పరిశ్రమల వివరాలేవీ లేకుండానే పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ లేఖను కేంద్రపర్యావరణ శాఖ మంత్రికి కేవీపీ రాశారు.