2019 ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌కల్యాణ్‌

తమ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గురువారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాజధాని అమరావతి శంఖస్థాపనకు తాను రాలేకపోయాయని, అందుకే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని తెలిపారు. సీఎం చంద్రబాబుతో తాను జరిపిన చర్చల్లో ప్రత్యేక హోదాపై చర్చకు వచ్చినా కేంద్రం ప్రకటించే తుది నిర్ణయం ఆధారంగా ప్రతిస్పందించాలని భావించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపాల్సిందేనని, […]

Advertisement
Update:2015-11-12 05:36 IST

తమ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గురువారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాజధాని అమరావతి శంఖస్థాపనకు తాను రాలేకపోయాయని, అందుకే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని తెలిపారు. సీఎం చంద్రబాబుతో తాను జరిపిన చర్చల్లో ప్రత్యేక హోదాపై చర్చకు వచ్చినా కేంద్రం ప్రకటించే తుది నిర్ణయం ఆధారంగా ప్రతిస్పందించాలని భావించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపాల్సిందేనని, లేకుంటే నష్టపోయేది భారతీయ జనతాపార్టీయేనని ఆయన అన్నారు. మీరు, చంద్రబాబు కలిసి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై ప్రత్యేక హోదాపై ప్రశ్నించవచ్చు కదా అన్న విలేఖరుల ప్రశ్నకు ఏ నిర్ణయమైనా కేంద్రం తుది ప్రకటన తర్వాతే ఉంటుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని అన్నారు. రాజధానిలో రైతుల భూముల విషయంపై కొత్తగా ఏమీ చర్చించలేదని, ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారని, ఎవరి నుంచీ బలవంతంగా భూములు లాక్కోబోమని ఆయన చెప్పారని తెలిపారు. పార్టీ విస్తరించడానికి చేసే ప్రయత్నాలపై ప్రశ్నించినప్పుడు తన వద్ద అంత డబ్బు ప్రస్తుతం లేదని, సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తమ చర్చల్లో ప్రస్తావన రాలేదని తెలిపారు. తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళానని, కేవలం రాజధాని మీదే దృష్టి పెట్టి మిగతా రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయని, దీన్నుంచి బయట పడాలని ఆయన్ని కోరానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై జారీ చేసిన జీవోపై విస్తృతంగా చర్చించామని, గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తవ్వకాలను జరుపుతామని, వారి నివాసాలను తొలగించే పనులు చేయబోమని బాబు హామీ ఇచ్చినట్టు తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాక్సైట్‌ తవ్వకాల అంశం తెరపైకి వచ్చిందని, ఇపుడు దానిని సీఎం కొనసాగింపు చర్యలు చేపట్టారని పవన్‌ వివరించారు. ఆదివాసీలకు అన్యాయం జరగకూడదనే అభిప్రాయంతోనే చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని తెలిపారు. తాను చెప్పిన అన్ని అంశాలపైనా చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Also Read: ఇప్పుడు డబ్బుల్లేవు… 2019లో వస్తా: పవన్

Tags:    
Advertisement

Similar News