వారూ మనలాంటివారే...గౌరవిద్దాం!
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మాసిన బట్టలు, రేగిన జుట్టు, జైలులాంటి చిన్న గది, ఒంటరితనం, ఈ ప్రపంచంలో నన్ను పట్టించుకునే మనిషి ఒక్కరూ లేరా….అనే ఆర్తితో వెతుకుతున్న కళ్లు, మంచానికి ఇనుప చైన్‌తో కట్టేసిన కాళ్లు….మానసిక వైకల్యం కారణంగా పిచ్చివాళ్లు అనే ముద్ర వేయించుకుని, ప్రపంచంలో ఎవరికీ పట్టని వారుగా దీనంగా బతుకులీడుస్తున్న ఇలాంటి వాళ్లు మన చుట్టూ ఎంతోమంది. అందరూ ఉన్నా, అన్ని హక్కులూ ఉన్నా ఏవీ వినియోగించుకోలేని, ఎవరికీ ఏమీ కానివాళ్లలాగే […]
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
మన సమాజంలో బలవంతులకు ధనవంతులకు, బుద్దిమంతులకు గౌరవం, విలువ, అధికారాలు ఇతరులకంటే మరింత ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇదొక సహజపరిణామం. అయితే ఇందులో ఒక కనిపించని మెలిక ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నవారికి సమాజం నుండి గౌరవమర్యా దలు ఎంత ఎక్కువగా లభిస్తుంటే, అంతగా ఆయా అంశాల్లో లోటుని ఎదుర్కొంటున్న వారు వెనుకబడుతున్నారని అర్థం. ఈ పరిణామం కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలవుతుంటారు. ముఖ్యంగా మానసికవైకల్యం ఉన్నవారికి ఈ అసమానత్వం నరకం చూపిస్తోంది. వారి ప్రమేయం ఏమాత్రం లేకుండా జన్యుపరమైన, మరింకే కారణాలతో నో మానసిక అంగవైకల్యానికి గురయినవారు, ఏ నేరమూ చేయకపోయినా దాదాపు ఖైదీల స్థాయిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారు.
మానసిక సమస్యలు సాధారణమే అయినా…
మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మానసికంగా సమస్యలుండి, శరీరం ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని ఆరోగ్యవంతుడని చెప్పలేము. మన సమాజంలో శారీరక అనారోగ్యాలను బయటకు చెప్పుకున్నట్టుగా మానసిక సమస్యలను బయటపెట్టరు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం అనగానే దాన్ని ఒక అవమానంగా, చెప్పుకోలేని సమస్యగా భావిస్తారు. శరీరానికి సమస్యలు వచ్చినట్టుగానే మనసుకీ వస్తాయని, నిపుణులను సంప్రదించి వాటి నుండి బయటపడవచ్చనే స్పృహ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువ. మానసిక సమస్యల కారణంగా 90శాతం పైగా అనారోగ్యాలు వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నా మనమింకా వీటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక పూర్తిగా మానసిక అంగవైకల్యానికి గురయినవారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. వారి జీవితాలకూ విలువ గౌరవం ఉన్నాయనే విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. వారిని ఆ స్థితి నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు సైతం ఏమాత్రం జరగటం లేదు.
హక్కులు ఉన్నా… దక్కవు!
తమకు జరుగుతున్న అవమానాలను కానీ, అసమానతలను కానీ గుర్తించే స్థితిలో మానసిక వికలాంగులు ఉండరు. వారి తరపున ఉద్యమించి ప్రశ్నించాల్సిన బాధ్యత తోటి మనుషులదే. మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి ఇస్తున్న నిర్వచనంలో మానసిక వైకల్యం కారణంగా ఎవరినీ వివక్షకు గురిచేయకూడదని స్పష్టంగా ఉంది. అలా చేయడం అనేది సహజాతంగా మనిషికి లభించే హక్కుని, విలువని కించపరచడమేనని పేర్కొంది.
ఒక మనిషికి పుట్టుకతోనే ఈ సమాజంలో ఒక గౌరవమైన స్థానం పొందే హక్కు ఉంది. దాన్ని ఏ కారణంగానూ ఎవరూ భంగపరచలేరు. అందరిలాగే సమాజంలో గౌరవం గుర్తింపు పొందే అధికారం మానసిక వైకల్యం ఉన్నవారికి కూడా ఉంది. హింస, అగౌరవం, వివక్షలకు గురికాకుండా, తమ జీవితాన్ని తాము సర్వస్వతంత్రంగా జీవించే హక్కు, సమాజంలో అందరితో కలిసి అందరిలాగే నివసించే హక్కు… ఇవన్నీ మానవ హక్కుల కిందకే వస్తాయి. అయితే మానసిక వైకల్యం ఉన్నవారికి ఇవన్నీ అందడం లేదన్నది అందరికీ తెలిసిన నిజం. వారికి సమాజం, కుటుంబం, ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుండి అందాల్సినంత అండ దొరకడం లేదన్నది మరింత నిజం.
దూరంగా…దయనీయంగా….
- వీరు నివసిస్తున్న చికిత్సా కేంద్రాల్లో, సంస్థల్లో దాదాపు బందీలుగా ఉంటున్నారు.
- చాలాసార్లు వీరు భౌతిక, లైంగిక దాడులకు గురి అవుతున్నారు. భావోద్వేగ పరమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఆసుపత్రులు, జైళ్లు, ఇళ్లు…ఎక్కడ నివసిస్తున్నా వీరికి ఈ బాధలు తప్పడం లేదు.
- తాము ఎక్కడ చికిత్స తీసుకోవాలి, ఎక్కడ నివసించాలి లాంటి అంశాలే కాదు, తమ జీవితానికి సంబంధించి ఏ విషయంలోనూ కనీస నిర్ణయాలు తీసుకునే హక్కు వీరికి ఉండటం లేదు.
- ఒకసారి మానసిక వైకల్యానికి గురయితే వారి సాధారణ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాల పట్ల శ్రద్ధ కరువవుతోంది. తప్పనిసరిగా ఇతరులమీద ఆధారపడాల్సి ఉండటంతో తీవ్రమైన అశ్రద్ధకు గురవుతున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితికి గురయినవారు సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికంటే త్వరగా మరణం పాలవుతున్నారు.
- వీరికి చదువు, ఉద్యోగ అవకాశాలు అందనంత దూరంలో ఉంటున్నాయి. వారి పరిస్థితిని సమీక్షించి వారికి తగిన విధంగా విద్యని బోధించడం, చేయగలిగిన వృత్తుల్లో శిక్షణ ఇప్పించడం, వారిని తమ కాళ్లమీద తాము నిలబడేలా చేయగలగటం…ఇవన్నీ నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. కానీ ఇవేమీ జరగడం లేదు.
- అన్నింటికంటే దురదృష్టమేమిటంటే వారు అనుభవిస్తున్న దుర్బర పరిస్థితులను మార్చుకునే అవకాశం వారి చేతుల్లో లేకపోవడం. సామాజిక అంశాల్లో, ప్రభుత్వం కార్యకలాపాల్లో వీరికి పాత్రే ఉండడం లేదు. తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలను కూడా ఎవరో నిర్ణయిస్తారు. వాటిపై ప్రభుత్వం తయారు చేసే పాలసీల్లోనూ వీరి ప్రమేయం ఏమాత్రం ఉండటం లేదు. అసలు వారి జీవితాలను ఒక సవ్యమైన, గౌరవనీయమైన పంథాలో తీసుకువెళ్లేందుకు ఏం చేయాలి…అనే ఆలోచనలు సభ్య సమాజంలో, ప్రభుత్వాల్లో, కుటుంబాల్లోనూ రాకపోవడం దురదృష్టకరం. ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన అంశాలే.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తున్న పరిష్కారాలు
- ప్రభుత్వాలు, వైద్య నిపుణులు, కుటుంబాలు ప్రజలు అందరూ కలిసి సంయుక్తంగా తగిన కార్యకలాపాలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వీరంతా కలిసి తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం పాలసీల్లో, సేవా కార్యక్రమాల్లో ప్రతిబింబించేలా చేయాలని, అందరూ కలిసి కట్టుగా మానసిక వికలాంగుల కోసం పాటుపడాలని చెబుతోంది.
- మెంటల్ హెల్త్ కేర్ రంగంలో కృషి చేసే ఆరోగ్య సిబ్బంది కేవలం చికిత్సలోనే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో సమగ్ర అభివృద్ధిని తీసుకురావాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిలోని ఆశలు, ఆశయాలు తెలుసుకుని వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలని సూచించింది.
- సాటి పౌరులు, సామాజిక సేవాసంస్థలను ఈ బృహత్కార్యంలో పాల్గొనేలా చేయాలి. వైకల్యం ఉన్నవారి కుటుంబాలు ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకుంటూ తమ వారి హక్కులను రక్షించడానికి సహకరించుకోవాలని సూచించింది.
-వి. దుర్గాంబ